district information system for education
-
మా డేటా మాదే..!
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర సమాచారం తమకు ప్రత్యేకంగా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్న విద్యాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచార నిధి(డేటా బేస్) యు–డైస్(డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)తో తమకు సంబంధం లేదని పేర్కొంది. యూడైస్ ప్లస్ పేరుతో కేంద్రం సరికొత్త పోర్టల్‌ను సృష్టించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీల వివరాలు ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. స్కూళ్లలో మౌలిక వసతులు, ఆధార్ అనుసంధానం, మధ్యాహ్న భోజన వివరాలను యూడైస్ ప్లస్‌లో అందించాలి. అందులో అడిగిన మేరకు సమాచారం అందించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాఠశాలల్లో నడిచే కార్యక్రమాలకు ఇదే కీలకమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యూడైస్ ప్లస్ ద్వారా సమాచారం ఇవ్వకపోతే నిధుల విడుదల కష్టమని హెచ్చరించినట్టు తెలిసింది. నేడు, రేపు సదస్సు యూడైస్ ప్లస్‌పై సమగ్ర అవగాహన కల్పించేందుకు శుక్ర, శనివారాల్లో విజయవాడలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన రాష్ట్రస్థాయి సమన్వయకర్తలు ఈ సదస్సులో పాల్గొనాలని సూచించింది. వీరి ద్వారా జిల్లాస్థాయిలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాస్థాయిలో సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఏఎస్వోలకు కొత్త విధానంపై సంపూర్ణ అవగాహన కలిగించి ఏమైనా సందేహాలుంటే శిక్షణ పొందినవారు నివృత్తిచేస్తారు. ’డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ, న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో సదస్సు జరుగుతోంది. ‘యు–డైస్ ప్లస్’ కార్యాచరణపై కేంద్రం అన్ని జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. -
‘అక్షరం’ తడబడింది..
సాక్షి ముంబై: విద్యాప్రమాణాల విషయంలో మహారాష్ట్ర పరిస్థితి దిగజారింది. ఇదివరకు ఉన్న స్థానం నుంచి ఏకంగా ఐదు స్థానాలు పడిపోయింది. ఈ పరిణామంపై విద్య, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని, లేకుంటే మున్ముందు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని వారు అంటున్నారు. 2013-14 సంవత్సరాలకు సంబంధించి విద్యా అృవద్ధి సూచిక(ఈడీఐ)లో మహారాష్ట్ర 13 స్థానంలో ఉంది. అయితే రాష్ట్రం 2012-13 సంవత్సరానికి సంబంధించి 8వ ర్యాంకులో ఉండేది. రాష్ట్రంలో విద్యాప్రమాణాల స్థాయి, విద్యార్థుల తెలివితేటలు, విద్యా సంస్థల్లో సౌకర్యాలు తదితర అంశాల ఆధారంగా జిల్లా విద్యా సమాచార వ్యవస్థ ఏటా ఓ నివేదిక రూపొందిస్తుంది. ఈ విషయంలో జాతీయ స్థాయిలో చూస్తే ఐదో తరగతి వరకూ అయితే మహరాష్ట్ర 31వ స్థానంలోను, ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకూ అయితే 28వ స్థానంలోనూ ఉంది. అయితే ఆ తరువాతి తరగతుల విషయంలో మాత్రం రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. స్కూళ్ల సంఖ్య విషయంలోనూ మన రాష్ట్రం తీసికట్టుగానే ఉంది. ప్రతి వెయ్యి మంది పిల్లలకు కేవలం ఒకే ఒక పాఠశాల ఉండడంతో విద్యాప్రమాణాలు, అక్షరాస్యత శాతం దిగజారుతోందని ఆ నివేదిక పేర్కొంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి అశ్విని భిడే మాట్లాడుతూ ‘ ఏటా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం తదితర వర్గాల నుంచి ఆయా విద్యాసంస్థల్లో చేరిన వారి సంఖ్య ఆధారంగా ఈడీఐ ర్యాంకులు ఇస్తారు. అయితే గత ఏడాది రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తగ్గింది. దీంతో స్కూళ్లలో చేరేవారి సంఖ ్య తగ్గింది. దీనివల్లనే మన రాష్ట్రం పరిస్థితి దిగజారినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆయా రాష్ట్రాల్లో ఆయా వర్గాల జనాభా, స్కూళ్లలో చేరేవారి సంఖ్యలో తేడా ఉంటుంది. దీన్ని బట్టే మన స్థాయి తగ్గినట్లు అనిపిస్తోంద’ని అన్నారు. ఈ పరిస్థితిపై విద్యావేత్త హేరామ్ కులకర్ణి మాట్లాడుతూ ‘మన రాష్ట్ర పరిస్థితి దిగజారడం మంచి పరిణామం కాదు. త్రిపుర (14వ స్థానం), జమ్మూ కాశ్మీర్(9), హిమాచల్ ప్రదేశ్(7) స్థానాల్లో ఉన్నాయి. పెద్దరాష్ట్రమైన మనం వాటికన్నా వెనుకబడి ఉండడం తగదు. ఈ పరిస్థితిలో మార్పు రావాల’ని ఆయన అన్నారు.