సాక్షి ముంబై: విద్యాప్రమాణాల విషయంలో మహారాష్ట్ర పరిస్థితి దిగజారింది. ఇదివరకు ఉన్న స్థానం నుంచి ఏకంగా ఐదు స్థానాలు పడిపోయింది. ఈ పరిణామంపై విద్య, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని, లేకుంటే మున్ముందు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని వారు అంటున్నారు.
2013-14 సంవత్సరాలకు సంబంధించి విద్యా అృవద్ధి సూచిక(ఈడీఐ)లో మహారాష్ట్ర 13 స్థానంలో ఉంది. అయితే రాష్ట్రం 2012-13 సంవత్సరానికి సంబంధించి 8వ ర్యాంకులో ఉండేది. రాష్ట్రంలో విద్యాప్రమాణాల స్థాయి, విద్యార్థుల తెలివితేటలు, విద్యా సంస్థల్లో సౌకర్యాలు తదితర అంశాల ఆధారంగా జిల్లా విద్యా సమాచార వ్యవస్థ ఏటా ఓ నివేదిక రూపొందిస్తుంది. ఈ విషయంలో జాతీయ స్థాయిలో చూస్తే ఐదో తరగతి వరకూ అయితే మహరాష్ట్ర 31వ స్థానంలోను, ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకూ అయితే 28వ స్థానంలోనూ ఉంది. అయితే ఆ తరువాతి తరగతుల విషయంలో మాత్రం రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది.
స్కూళ్ల సంఖ్య విషయంలోనూ మన రాష్ట్రం తీసికట్టుగానే ఉంది. ప్రతి వెయ్యి మంది పిల్లలకు కేవలం ఒకే ఒక పాఠశాల ఉండడంతో విద్యాప్రమాణాలు, అక్షరాస్యత శాతం దిగజారుతోందని ఆ నివేదిక పేర్కొంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి అశ్విని భిడే మాట్లాడుతూ ‘ ఏటా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం తదితర వర్గాల నుంచి ఆయా విద్యాసంస్థల్లో చేరిన వారి సంఖ్య ఆధారంగా ఈడీఐ ర్యాంకులు ఇస్తారు. అయితే గత ఏడాది రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తగ్గింది. దీంతో స్కూళ్లలో చేరేవారి సంఖ ్య తగ్గింది.
దీనివల్లనే మన రాష్ట్రం పరిస్థితి దిగజారినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆయా రాష్ట్రాల్లో ఆయా వర్గాల జనాభా, స్కూళ్లలో చేరేవారి సంఖ్యలో తేడా ఉంటుంది. దీన్ని బట్టే మన స్థాయి తగ్గినట్లు అనిపిస్తోంద’ని అన్నారు. ఈ పరిస్థితిపై విద్యావేత్త హేరామ్ కులకర్ణి మాట్లాడుతూ ‘మన రాష్ట్ర పరిస్థితి దిగజారడం మంచి పరిణామం కాదు. త్రిపుర (14వ స్థానం), జమ్మూ కాశ్మీర్(9), హిమాచల్ ప్రదేశ్(7) స్థానాల్లో ఉన్నాయి. పెద్దరాష్ట్రమైన మనం వాటికన్నా వెనుకబడి ఉండడం తగదు. ఈ పరిస్థితిలో మార్పు రావాల’ని ఆయన అన్నారు.
‘అక్షరం’ తడబడింది..
Published Thu, Jul 24 2014 11:12 PM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement