ప్చ్.. ఆస్కార్‌కు ఆస్కార్ మాత్రం రాలేదు!
సినీ ప్రపంచంలో ఆయనొక సంచలనం. ఒకరకంగా ఎలక్ట్రానిక్ మ్యూజిక్కు మార్గదర్శకుడు. అయినా ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఆస్కార్’ మాత్రం రాలేదు. ఆయనే ఆస్కార్ సాలా. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా గూగుల్ డూడుల్‌తో నివాళి ఇచ్చింది.
బెర్లిన్: భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రానిక్ సంగీత స్వరకర్త ఆస్కార్ సాలా 112వ జయంతి వేడుకలను గూగుల్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రత్యేక డూడుల్ ద్వారా ఆస్కార్ సాలాకు నివాళులర్పించింది. జర్మనీలోని గ్రీజ్‌లో 1910లో జన్మించిన ఆస్కార్‌ను ఎలక్ట్రానిక్ మ్యూజిక్కు మార్గదర్శకుడిగా పిలుస్తారు. ఆయన 1930లో ఎలక్ట్రానిక్ సింథసైజర్‌తో చేసిన 'ట్రాటోనియం' అనే పరికరాన్ని వాయించేవారు.
ఆస్కార్ సాలా తల్లి గాయని కాగా.. తండ్రి సంగీతంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి.. కంటి డాక్టర్ కూడా. సంగీతంలోనే పుట్టి పెరిగారు ఆస్కార్ సాలా. చిన్న వయసులోనే పియానో వాయిస్తూ కన్సెర్ట్‌లు ఇచ్చేవారు. బెర్లిన్‌కు చెందిన వయోలిస్ట్ పాల్ హిందెమిత్ వద్ద పియోనో వాయించటం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఫ్రెడరిక్ ట్రాట్వీన్ కనిపెట్టిన ఎలక్ట్రానిక్ సింథసైజర్ ట్రాటోనియంపై ఆసక్తి పెంచుకున్నారు. దాంతో పాటు భౌతికశాస్త్రం, స్వరకల్పనపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మిక్సర్ ట్రాటోనియంను అభివృద్ధి చేశారు. ప్రత్యేక డిజైన్‌లో ఒకేసారి పలు రకాల శబ్దాలు, మాటలను వినిపించేలా ఉండటం దాని ప్రత్యేకత. ఒక స్వరక్తరగా, ఎలక్ట్రో ఇంజినీర్‌గా ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌లో విశేష సేవలందించారు.
సినిమాలకు సంగీతం..
1940-50 మధ్య చాలా సినిమాలకు పని చేశారు ఆస్కార్ సాలా. ఆ తర్వాత తన సొంత స్టూడియోలో చాలా సినిమాలకు ఎలక్ట్రానిక్ సౌండ్ట్రాక్స్ను అందించారు. అలాగే.. రేడియో, టీవీ కార్యక్రమాలతో పాటు రోస్మ్యారీ(1959), ద బర్డ్స్(1962) చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత.. క్వార్టెట్ ట్రాటోనియం, కన్సెర్ట్ ట్రాటోనియం, వోల్క్స్ట్రాటోనియంలను అభివృద్ధి చేశారు. 1995లో జర్మనీ మ్యూజియంకు తన మిక్సర్ ట్రాటోనియంను విరాళంగా ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.. ఒక్క ఆస్కార్ తప్ప.!
ఇదీ చదవండి: గూగుల్‌ని తిట్టిపోస్తున్న నెటిజన్లు...నివాళి ఇచ్చే పద్ధతి ఇదేనా!