‘డూడుల్’ విజేతలు మనోళ్లే
తెలుగు విద్యార్థుల అరుదైన ఘనత
సీతమ్మధార(విశాఖపట్నం): సెర్చింజన్ ధిగ్గజం గూగుల్ ప్రతి ఏటా నిర్వహించే ‘డూడుల్ ఫర్ గూగుల్’ పోటీలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. విశాఖకు చెందిన పి.కార్తిక్ రూపొందించిన డూడుల్ ఈ పోటీలో విజేతగా నిలిచింది. బాలల దినోత్సవం సందర్భంగా శనివారం గూగుల్ హోమ్ పేజీలో ఈ డూడుల్‌ను ప్రదర్శించారు. వరసగా ఏడో ఏడాది గూగుల్ నిర్వహించిన ఈ పోటీలో ఈ సారికి విజేతగా నిలిచిన కార్తిక్ విశాఖలోని శ్రీ ప్రకాశ్ విద్యానికేతన్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. తొమ్మిదేళ్ల వయసులోనే గూగుల్ డూడుల్ పోటీలో విజేతగా నిలవడంతో కార్తీక్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు.
‘ఇండియా కోసం దేన్నైనా సృష్టించే అవకాశం వస్తే.. దీన్ని చేసి చూపించగలను’ అనే అంశం పై ఈ సారి గూగుల్ డూడుల్ పోటీని నిర్వహించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైకిల్ చేసే యంత్రంలో గూగుల్ లోగోను డిస్‌ప్లే చేస్తూ కార్తీక్ డూడుల్‌ను రూపొందించాడు. ఇదే పోటీలో గ్రూప్-2 విభాగంలో ఆరో తరగతి చదువుతున్న పి.రమ్య ‘గ్రీన్ సిటీ- డ్రీమ్ సిటీ’ కాన్సెప్ట్ మీద డూడుల్ రూపొందించి విజేతగా నిలిచింది. రమ్య గతంలో అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీల్లో అవార్డు గెలుచుకుంది. అలాగే హార్లిక్స్ నిర్వహించిన పోటీల్లో కూడా స్వర్ణ పతక విజేతగా నిలిచింది. రమ్య, కార్తిక్‌లు అక్కాతమ్ముళ్లు కావడం విశేషం. వీరి తండ్రి కృష్ణ విశాఖలో ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. తల్లి దేవి గృహిణి.