ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
ఐదుగురికి మెమోలు
హన్మకొండ అర్బన్ : విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురు పంచాయతీ ఉద్యోగులపై డీపీఓ పద్మజారాణి కొరడా ఝళిపించారు. ఒకే రోజు ఏకంగా ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయడంతో పాటు ఐదుగురిపై చార్జెస్ ఫ్రేం చేశారు. దీంతో ఒక్కసారిగా పంచాయతీ శాఖ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వేటుపడిన వారిలో మంగపేట మండలం కమలాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సీహెచ్.పుల్లయ్య, హరితహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా పరకాల మండలం కౌకొండ కార్యదర్శి జగదీష్‌ను సస్పెండ్ చేస్తూ డీపీఓ పద్మజారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదేవిధంగా పెద్దమొత్తంలో నిధులు నగదు నిల్వ ఉంచుకున్నందుకు చిట్యాల మండలం రామకృష్ణాపూర్(టి) కార్యదర్శి శంకర్, ములుగు మండలం సర్వాపూర్ కార్యదర్శి నర్సింహారెడ్డి, ములుగు మండలం కాశిందేవిపేట కార్యదర్శి ఎండీ మహమూద్, గణపురం కార్యదర్శి సత్యనారాయణ, ఇదే మండలం పర్కపల్లి కార్యదర్శి కొండయ్య, నగరంపల్లి కార్యదర్శి విజేందర్‌లపై చార్జెస్ ఫ్రేం చేసినట్లు డీపీఓ తెలిపారు. వీరు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి విచారణ, చర్యలు ఉంటాయని అన్నారు. హరితహారంలో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగానికి పాల్పడితే సహించేదిలేదని ఈ సందర్భంగా డీపీఓ హెచ్చరించారు.