జీన్స్, టీషర్ట్‌లతో ఈ ఆలయంలోకి నో ఎంట్రీ
సాక్షి, బెంగళూర్ : కర్నాటకలోని గోకర్ణలో మహాబలేశ్వర్ ఆలయంలోకి జీన్స్ ప్యాంట్, ట్రౌజర్లు, బెర్ముడా షార్ట్స్‌తో భక్తులను అనుమతించడంపై నిషేధం విధించారు. ఆలయంలో ఇప్పటికే తాము డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తున్నామని గోకర్ణ మహాబలేశ్వర్ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హాలప్ప గురువారం వెల్లడించారు. షర్ట్, ప్యాంట్, టోపీ, కోటు ధరించిన భక్తులను కూడా అనుమతించమని స్పష్టం చేశారు. పురుషులు కేవలం ధోవతితోనే ఆలయంలోకి రావాలని, వారిని షర్టులు, టీషర్టులతో లోపలకి అనుమతించమన్నారు.
ఇక మహిళలు జీన్స్ ప్యాంట్ ధరించి ఆలయానికి రాకూడదని వారు కేవలం చీరలోనే ఆలయంలోకి ప్రవేశించాలని హాలప్ప వెల్లడించారు. గోకర్ణలోని మహాబలేశ్వర ఆలయాన్ని కాదంబ వంశానికి చెందిన మయూర్ శర్మ 4వ శతాబ్ధంలో నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. మరోవైపు గోకర్ణ ప్రముఖ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందిన క్రమంలో ఇలాంటి నియమాలు సందర్శకులకు ఇబ్బంది కలిగిస్తాయని గోకర్ణ ఆలయానికి సమీపంలోని రామచంద్రపుర మఠం అడ్మినిస్ట్రేటర్ జీకే హెగ్డే అన్నారు.
పురుషులకు మాత్రమే షర్ట్లు వేసుకుని ఆలయానికి రాకూడదనే నిబంధన విధించవచ్చని, మహిళలపై ఎలాంటి నియంత్రణలు ఉండరాదని ఆయన అభిప్రాయపడ్డారు. భక్తులు, ఆలయ పూజారులతో చర్చించిన తర్వాతే డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టాలని కోరారు. కాగా హంపిలోని విరూపాక్ష ఆలయంలోనూ ఇదే తరహా నిబంధనలు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది.