ఎమ్మెల్యే రామకృష్ణను ఛీకొట్టండి
కురుగొండ్లపై చర్యలు తీసుకోవాలంటూ డీవైఎఫ్ఐ ర్యాలీ
నెల్లూరు(సెంట్రల్): అవినీతికి కేరాఫ్‌గా మారి బెదిరింపులకు దిగుతున్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను ఛీకొట్టాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటరు నుంచి గాంధీబొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేసే రామకృష్ణను ప్రతిఒక్కరూ ఛీకొట్టి బుద్ధిచెప్పాలన్నారు. రోజురోజుకూ ఆయన చేష్టలు మితిమీరిపోతున్నాయని, గతంలో కలెక్టర్‌ను సైతం భయపెట్టడానికి ప్రయత్నించిన వ్యక్తి రామకృష్ణ అని పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో ఇటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నారని, వీరు చేసే అరాచకాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రైల్వే కాంట్రాక్టర్‌ను రూ.5 కోట్లు డిమాండ్ చేయడం, పనులు జరగకుండా భయపెట్టడం రాక్షస చర్యగా అభివర్ణించారు. ఇలాంటి వ్యక్తులు ప్రజల మధ్య ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో కార్యదర్శి కిరణ్, నంద కిరణ్, రాము, చిన్న, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.