Ecet
-
ఒక్క క్లిక్‌తో తెలంగాణ ఈ-సెట్ రిజల్ట్స్
ఒక్క క్లిక్‌తో ఈసెట్ రిజల్ట్స్హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల్ని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా ఫలితాల కోసం క్లిక్ చేయండిఅధికారిక వెబ్సైట్ నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ర్యాంకుల్ని బట్టి పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలు పొందుతారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను ఉస్మానియా వర్శిటీ నిర్వహించింది. -
సెప్టెంబర్ 19న ఏపీ ఈసెట్ పరీక్ష
సాక్షి, అమరావతి: 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ఏపీ ఈసెట్ (ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్) పరీక్ష సెప్టెంబర్19న నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆగష్టు 12 వరకు దరఖాస్తుల స్వీకరించేందుకు గడువు విధించింది. అలాగే వెయ్యి రూపాయల ఫైన్‌తో ఆగస్టు 23 వరకు అవకాశం కల్పించింది. ఏపీ ఈసెట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున అనంతపురంలోని జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్/బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది(లేటరల్ ఎంట్రీ)లో ప్రవేశం లభిస్తుంది. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని వీసీ రంగజనార్ధన్ తెలిపారు. -
ఏపీ సెట్.. ఈజీగా అప్లై చేసుకోండి ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించనున్న పలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిల్లో ఏపీ ఈఏపీసెట్, ఏపీఈసెట్, ఏపీ ఐసెట్, ఏపీ ఎడ్‌సెట్, ఏపీ పీజీఈసెట్, ఏపీ లాసెట్ తదితరాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఆయా సెట్లకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. సదరు ఏపీ సెట్లకు అర్హతలు, ప్రవేశం కల్పించే కోర్సులు, ప్రవేశ పరీక్షల విధానంపై ప్రత్యేక కథనం... ఏపీ ఈఏపీసెట్ ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్(ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే ఎంట్రన్స్ టెస్టు.. ‘ఈఏపీసెట్’ (పూర్వపు ఎంసెట్). ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్టీయూ, కాకినాడ నిర్వహిస్తోంది. ► ప్రవేశం కల్పించే కోర్సులు: ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ), బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ. అర్హతలు ► ఇంజనీరింగ్, ఫార్మసీ(ఎంపీసీ), ఫార్మా డీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత/తత్సమాన అర్హత ఉండాలి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► బీఎస్సీ అగ్రికల్చర్/బీఎస్సీ హార్టికల్చర్/బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్ఎస్సీ /బీటెక్ (ఎఫ్ఎస్టీ)/బీఎస్సీ(సీఏ అండ్ బీఎం)/బీఫార్మసీ/బీటెక్(బయోటెక్నాలజీ)(బైపీసీ), ఫార్మా డీ(బైపీసీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ బైపీసీ/తత్సమాన అర్హత ఉండాలి. ► ఇంజనీరింగ్ పరీక్ష విధానం: ఇంజనీరింగ్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ) విధానంలో జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు–80మార్కులకు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు సెట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ► అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష విధానం: అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో బయాలజీ 80 ప్రశ్నలు–80 మార్కులకు(బోటనీ 40, జువాలజీ 40); ఫిజిక్స్ 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు –40 మార్కులకు పరీక్ష ఉంటుంది. ► ఈఏపీసెట్‌లో అర్హత సాధించేందుకు కనీసం 25 శాతం మార్కులు రావాలి. ఎంట్రెన్స్‌లో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ కల్పించి.. తుది ర్యాంకు ప్రకటిస్తారు. ఎస్సీ/ఎస్టీలకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021(ఆలస్య రుసం లేకుండా) ► పరీక్ష తేదీలు: ఆగస్టు 19 నుంచి 25 వరకు ► ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్: https://sche.ap.gov.in/EAPCET/EapcetHomePages/Home.aspx ఏపీ ఈసెట్ ఏపీ ఈసెట్(ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున అనంతపురంలోని జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్/బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది(లేటరల్ ఎంట్రీ)లో ప్రవేశం లభిస్తుంది. అర్హతలు ► డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫార్మసీ/బీఎస్సీ(మ్యాథమెటిక్స్) అభ్యర్థులు ఈసెట్‌కు దరఖాస్తుకు అర్హులు. కనీసం 45 శాతం మార్కులతో సంబంధిత కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. పరీక్ష విధానం ► ఈసెట్ పరీక్ష మూడు విధాలుగా జరుగుతుంది. ఇంజనీరింగ్/ఫార్మసీ/బీఎస్సీ విభాగాల అభ్యర్థులకు భిన్నంగా ప్రశ్న పత్రం ఉంటుంది. 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ► ఇంజనీరింగ్ విభాగంలో.. మ్యాథ్స్ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఫిజిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, కెమిస్ట్రీ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంజనీరింగ్(సంబంధిత బ్రాంచ్) 100 ప్రశ్నలు–100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. ► ఫార్మసీ విభాగంలో.. ఫార్మాస్యూటిక్స్–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మకాలజీ–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మాకోగ్నసీ–50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ► బీఎస్సీ(మ్యాథ్స్) విభాగంలో మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు–100 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు–50 మార్కులకు, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021 ► పరీక్ష తేది: 19.09.2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx ఏపీ ఐసెట్ ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఐసెట్–2021 కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది ఐసెట్‌ను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. అర్హతలు ► 10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు ఎంబీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఎంసీఏకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ► డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ వర్గాల అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. పరీక్ష విధానం ► ఐసెట్ పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్సన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ 75 ప్రశ్నలు–75 మార్కులు; సెక్షన్ బీలో కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 ప్రశ్నలు–70 మార్కులకు; సెక్షన్ సీలో మ్యాథమెటికల్ ఎబిలిటీ55ప్రశ్నలు–55 మార్కు లకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.08.2021 ► ఏపీ ఐసెట్ పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబర్ 17,18 ► వెబ్సైట్: https://sche.ap.gov.in/icet ఏపీ ఎడ్‌సెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ/గవర్నమెంట్/ఎయిడెడ్/ప్రైవేట్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో.. రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు ఏపీ ఎడ్‌సెట్–2021 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ► బీఏ/బీకామ్/బీఎస్సీ/బీఎస్సీ/బీబీఎంలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్/బీఈలో 50 మార్కులు తెచ్చుకున్నవారు సైతం బీఈడీలో చేరేందుకు అర్హులు. పరీక్ష విధానం ► ఎడ్‌సెట్ ఆన్లైన్ విధానంలో మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు జరుగుతుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2గంటలు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు–15 మార్కులు, టీచింగ్ అప్టిట్యూడ్10 ప్రశ్నలు–10 మార్కులు; –మెథడాలజీలో మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు–100 మార్కులు/ఫిజికల్ సైన్స్: ఫిజిక్స్–50, కెమిస్ట్రీ–50/బయలాజికల్ సైన్స్: బోటనీ–50, జువాలజీ–50/సోషల్ స్టడీస్: జాగ్రఫీ–35, చరిత్ర–30, సివిక్స్–15, ఎకనామిక్స్–20(మొత్తం 100)/ ఇంగ్లిష్: 100 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► దరఖాస్తులకు చివరి తేది: 17.08.2021 ► ఎడ్‌సెట్ పరీక్ష తేది: 21.09.2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx ఏపీపీజీఈ సెట్ ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్(ఎంటెక్/ఎంఈ/ఎంఫార్మా,ఫార్మాడీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ పీజీఈసెట్–2021 నోటిఫికేషన్ విడుదలైంది. ► అర్హత: బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించాలి, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 45శాతం మార్కులు వచ్చి ఉండాలి. పరీక్ష ‘ఆన్లైన్’ విధానంలో ఉంటుంది. మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. ప్రశ్నలు అభ్యర్థి ఏ విభాగంలో పీజీ చేయదలచారో దాని ఆధారంగా ఉంటాయి. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.08.2021 ► ఏపీపీజీఈ సెట్ తేదీలు:27–30 సెప్టెంబర్ 2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/PGECET -
ఆగస్టు 19 నుంచి ‘సెట్లు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఈఏపీ సెట్–2021 సహా వివిధ సెట్ల షెడ్యూళ్లను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఆగస్టు 19 నుంచి 25 వరకు జరగనుందన్నారు. ఏపీఈఏపీ సెట్ గతంలో ఏపీ ఎంసెట్‌గా ఉండేది. ఈఏపీ సెట్‌తో పాటు ఇతర సెట్ల పరీక్షల నిర్వహణ తేదీలను మంత్రి వెల్లడించారు. -
తెలంగాణ ఎంసెట్ 2021 షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలు ఖరార య్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఆయా తేదీలను శుక్రవారం ప్రకటించారు. ప్రధానమైన ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ బీఈ/బీటెక్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవే శాల కోసం ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు తెలి పారు. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీఈ/బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (ల్యాటరల్ ఎంట్రీ) ఈసెట్‌ను జూలై 1వ తేదీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి జూన్ 14వ తేదీ తరువాత ఎప్పుడైనా సెట్స్‌ను నిర్వహించేందుకు ఉన్నత విద్యా మం డలి సిద్ధంగా ఉన్నా, ఆన్లైన్ పరీక్షలను నిర్వ హించే సాంకేతిక సంస్థ అయిన టీసీఎస్ ఖాళీ స్లాట్స్ జూన్ లో ఎక్కువగా లేకపోవడం, పైగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరమ్యే ఎంసెట్ పరీక్ష లను నిర్వహించేందుకు టీసీఎస్‌కు జూన్ లో సిబ్బంది కొరత ఉంటుందనే కారణంతో జూలై లోనే నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడిం చారు. అయితే తక్కువ మంది విద్యార్థులు హాజ రయ్యే పీజీఈసెట్‌ను జూన్ 20 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎంఈ/ఎంటెక్/ఎంఫార్మసీ/ఫార్మ్–డి(పీబీ), మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో దీని ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా అనేక ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్న టీసీఎస్ ప్రతినిధులతో చర్చించి, ఖాళీగా ఉన్న స్లాట్స్‌లో సెట్స్ తేదీలను ఖరారు చేసినట్లు వెల్లడించారు. అలాగే అన్ని సెట్స్‌కు నిర్వహణ యూనివర్సిటీలను, కన్వీనర్లను నియమించినట్లు తెలిపారు. 70 శాతం సిలబస్‌తో ఎంసెట్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70% సిలబస్, ‘ప్రథమ’లో పూర్తి సిలబస్‌తో ఎంసెట్‌ను నిర్వహి స్తామన్నారు. ఇప్పటికే ఈ నిర్ణయం జరిగినందున ఇంటర్‌బోర్డు కూడా సిలబస్‌ను, మోడల్ ప్రశ్నా పత్రాలను అందుబాటులో ఉంచిందన్నారు. ఎంసెట్ పేపరు సెట్టింగ్ సమయంలో ఆ సిలబస్‌నే పరిగణనలోకి తీసుకుంటారని వెల్లడించారు. సిలబస్ వివరాలను కూడా ఎంసెట్ నోటిఫికేషన్ సమయంలో వెబ్సైట్లో ఎంసెట్ కమిటీ అందుబాటులో ఉంచుతుందని వివరించారు. ఎంసెట్ నోటిఫికేషన్ వారం, పదిరోజుల్లో జారీ అయ్యే అవకాశం ఉంది. జూలై చివర్లో లేదా ఆగస్టులో... మరో నాలుగు సెట్స్ తేదీలను ఇంకా ఖరారు చేయలేదని పాపిరెడ్డి తెలిపారు. వాటిని జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్, 3 ఏళ్లు, 5 ఏళ్ల న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు లాసెట్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ తేదీలను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. సాధారణ పరిస్థితుల్లో మార్చిలో ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్‌లో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు జరిగేవన్నారు. వాటి ప్రకారం మే నెలలో ఎంసెట్, ఇతర సెట్స్ నిర్వహించే వారిమన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆ పరీక్షలన్నీ రెండు నెలలు ఆల స్యంగా నిర్వహించాల్సి వస్తోంద న్నారు. యూనివర్సిటీల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల తేదీలను ఇంకా ఖరారు చేయలేదని, ప్రస్తుతం ప్రత్యక్ష బోధన మొదలైనందున త్వరలోనే ఆయా పరీక్షల తేదీలు ఖరారు అవుతాయన్నారు. వాటిని బట్టి ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని వివరించారు. చదవండి: బాబోయ్... ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు? -
ఈసెట్‌లో 96.12 శాతం ఉత్తీర్ణత
సాక్షి, అమరావతి: డిప్లొమో పాసైన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్–2020లో 96.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. కరోనా సమయంలోనూ పరీక్షలు విజయవంతంగా నిర్వహించడంతోపాటు ఫలితాలను త్వరగా విడుదల చేశారని అధికారులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర, మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి.భానుమూర్తి, మండలి కార్యదర్శి సుధీర్‌ప్రేమ్‌కుమార్, ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ► సెప్టెంబర్ 14న ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ పరీక్షల్ని 31,891 మంది రాశారు. 30,654 మంది (96.12 శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 25,160 మంది బాలురు, 6,731 మంది బాలికలు ఉన్నారు. ►"https://sche.ap.gov.in/ecet/'లో ఫలితాలను ఉంచారు. అభ్యర్థులు ఈనెల 8వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9న ఎంసెట్ ఫలితాలు ఏపీ ఎంసెట్ ఫలితాలను ఈనెల 9న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈసెట్ ఫలితాల విడుదల సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 2 నుంచి స్కూళ్లు తెరవాలని భావిస్తున్నామని, కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎవరికీ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. అయితే, కేంద్రం మళ్లీ ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించి దీనిపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సూచనలు అందిస్తామని తెలిపారు. సబ్జెక్టుల వారీగా ర్యాంకర్లు ► అగ్రికల్చరల్ ఇంజనీరింగ్: గొర్తి వంశీకృష్ణ, (అనంతపురం ) ► బీఎస్సీ మేథమెటిక్స్: శివాల శ్రీనివాసరావు (శ్రీకాకుళం) ► సిరామిక్ టెక్నాలజీ: తూతిక సంతోష్‌కుమార్ (ప్రకాశం జిల్లా) ► కెమికల్ ఇంజనీరింగ్: షేక్ మహమ్మద్ ముస్తాక్ అహ్మద్ (గుంటూరు) ► సివిల్: బానోతు అంజలి (ఖమ్మం) ► కంప్యూటర్ సైన్స్: కోడి తేజ (కాకినాడ) ► ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్: ఇ.నరేష్‌రెడ్డి (కడప) ► ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్: కురా వైష్ణవి (గుంటూరు జిల్లా) ► ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్: పృధ్వీ (రంగారెడ్డి జిల్లా) ► మెకానికల్: గరగా అజయ్ (విశాఖపట్నం) ► మెటలర్జికల్: వరుణ్‌రాజు (విజయనగరం) ► మైనింగ్: బానాల వంశీకృష్ణ (ములుగు, ఖమ్మం జిల్లా) ► ఫార్మసీ: బెజవాడ అశ్లేష్‌కుమార్ (కృష్ణా జిల్లా) ► ఫార్మసీ: జుట్టు శాంతి (శ్రీకాకుళం జిల్లా) -
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ : ఇంజనీరింగ్ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్ధులు తదుపరి ఉన్నత సాంకేతిక విద్యన కొనసాగించేందుక వీలుగా నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్-2020 ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. విద్యా శాఖ స్పెషల్ సిఎస్ సతీష్ చంద్ర, ఎపి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, సెక్రటరీ సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 14న రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించారు. 31,891 మంది పరీక్షలకు హాజరుకాగా, 30,654 మంది క్వాలిఫైఅ య్యారు. 96.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. క్వాలిఫై అయినవారిలో 25160 మంది పురుషులు, 6731 మంది మహిళలు ఉన్నారు. (ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సబ్జెక్టుల వారీగా ర్యాంకర్లు వీరే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ : గొర్తి వంశీకృష్ణ, (అనంతపురం ) బీఎస్సీ మేథమెటిక్స్ : శివాల శ్రీనివాసరావు (శ్రీకాకుళం) సిరామిక్ టెక్నాలజీ: తూతిక సంతోష్ కుమార్ (ప్రకాశం జిల్లా) కెమికల్ ఇంజనీరింగ్: ముస్తాక్ అహ్మద్ (గుంటూరు) సివిల్ ఇంజనీరింగ్: బానోతు అంజలి (ఖమ్మం) కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ : కోడి తేజ (కాకినాడ) ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: నరేష్ రెడ్డి ( కడప) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: కుర్రా వైష్ణవి ( గుంటూరు జిల్లా రేపల్లే) ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ట్రుమెంటెరషన్ ఇంజనీరింగ్ : ఫృద్వీ ( రంగారెడ్డి) మెకానికల్ ఇంజనీరింగ్ : గరగా అజయ్ ( విశాఖపట్టణం) మెటలర్జికల్ ఇంజనీరింగ్ : వరుణ్ రాజు ( విజయనగరం) మైనింగ్ ఇంజనీరింగ్ : బానాల వంశీకృష్ణ (ములుగు) ఫార్మసీ: అశ్లేష్ కుమార్( కృష్ణా జిల్లా చల్లపల్లి), శాంతి ( శ్రీకాళుళం జిల్లా మందస) -
తెలంగాణ ఈసెట్ పరీక్ష ప్రారంభం
-
కొనసాగుతున్న తెలంగాణ ఈసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈసెట్ నేటి ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 వరకు ముగుస్తుంది. మరొక సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగుతుంది. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల భద్రతపై అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఉదయం పరీక్షకు 14,415 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పరీక్షకు 13,600 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్టీయూ అధికారులు తెలిపారు. తెలంగాణలో 56, ఏపీలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి చేశామని, పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరిస్తామని అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు. కాగా, కోవిడ్ కారణంగా వాయిదాపడిన ఈసెట్, వైరస్ విజృంభణ అనంతరం నిర్వహిస్తున్న తొలి కామన్ ఎంట్రన్స్ టెస్టు కావడం గమనార్హం. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాల కోసం ఈసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. (చదవండి: అనుమతి లేకున్నా కరోనా టెస్టులు!) రేపు జేఈఈ మెయిన్ దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం మంగళవారం నుంచి సెప్టెంబర్ 6 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. దీనికోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశా రు. ఐఐటీ ఢిల్లీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) విధానంలో ఒక్కరోజులో 85 వేలమంది మెయిన్ పరీక్షలకు హాజరుకానున్నా రు. తెలంగాణ నుంచి 67,319 మంది, దేశవ్యాప్తంగా 8.58 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి. (చదవండి: జేఈఈ, నీట్ పరీక్షలపై సందేహాలెన్నో!?) -
ఈసెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 31న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6 వరకు మరో సెషన్లో పరీక్ష ఉండనుంది. కంప్యూటర్ ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు జేఎన్టీయూ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52, ఏపీలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. -
సెప్టెంబర్ 17 నుంచి 25 వరకూ ఏపీ ఎంసెట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సెప్టెంబర్ 10,11 తేదీల్లో ఐసెట్, 14న ఈసెట్, 28,29,30 తేదీల్లో ఏపీ పీఈసెట్, అక్టోబర్ 1న ఎడ్‌సెట్, 2వ తేదీన లాసెట్ నిర్వహించనుంది. ఎంసెట్, సహ వివిధ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ముందు షెడ్యూళ్లు ఇచ్చినా కరోనా, లాక్డౌన్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. సెప్టెంబర్ మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించాలని, అక్టోబర్ 15నుంచి తరగతులు ప్రారంభించాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి తాజా షెడ్యూల్‌ను రూపొందించింది. ఇక తెలంగాణలో ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి ఖరారు చేయనుంది. -
తెలంగాణలో ‘సెట్స్’ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కరసత్తు పూర్తయింది. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహించనుంది. అలాగే సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింతగ్ పరీక్షలను నిర్వహించనుంది. కోర్టు అనుమతితో ఈ తేదీలను ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించనుంది. అలాగే అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్ తదితర సెట్స్ తేదీలను పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి తేదీలను ఖరారు చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 2020–21 విద్యా సంవత్సరంలో అకడమిక్ వ్యవహారాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే తాము తీసుకున్న నిర్ణయాలను హైకోర్టుకు తెలియజేసి, కోర్టు ఆమోదంతో అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్‌లో పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందని ప్రభుత్వం ఈ సందర్భంగా న్యాయస్థానంకు తెలిపింది. ఇక ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. -
ఎంసెట్, ఈసెట్, ఐసెట్ తేదీలు ఖరారు
సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఎంసెట్‌తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. లాక్డౌన్ అనంతరం పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎంసెట్‌తో పాటు లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీ సెట్, ఈసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును మే 20 వరకు పొడగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. హేమచంద్ర రెడ్డి వెల్లడించారు. కరోనా, లాక్డౌన్లతో ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని మండలి నిరవధికంగా అప్పట్లో వాయిదా వేసింది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థల్లోకి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్, అడ్వాన్సు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ ఆన్లైన్ పరీక్షలను జులై 18 నుంచి 23వరకు నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించిన ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ ఇతర సెట్ల నిర్వహణకు వీలుగా తాజాగా సవరించిన షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఉన్నత విద్యామండలి ప్రకటించిన పరీక్ష తేదీలు ఎంసెట్ : జులై 27 నుంచి 31 వరకు ఈసెట్ : జులై 24 ఐసెట్ : జులై 25న పీజీసెట్ : ఆగస్ట్ 2 నుంచి 4 ఎడ్ సెట్ : ఆగస్టు 5 లా సెట్ : ఆగష్టు 6 ఈసెట్ : ఆగష్టు 7 నుంచి 9 వరకు -
ఏపీలో ఎంసెట్ దరఖాస్తుకు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు ఏపీ ఉన్నత విద్యామండలి మరో అవకాశాన్ని కల్పించింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లాసెట్ ఆన్లైన్ పరీక్షలకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 7వ తేదీ వరకూ గడువు పొడిగించింది. ఈ మేరకు సెట్స్ ప్రత్యేక అధికారి డాక్టర్ సుధీర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. -
అన్ని ఎంట్రెన్స్ టెస్టులు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యా మండలి అధికారికంగా వాయిదా వేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఆదివారం ప్రకటించింది. వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్) వాయిదా వేసినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ను ఈనెల 30వ తేదీ వరకు పొడగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 5వ తేదీ వరకు ఆయా సెట్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ముందస్తు షెడ్యూలు ప్రకారం మే 2వ తేదీన ఈసెట్, 4, 5, 7, 9, 11 తేదీల్లో ఎంసెట్, మే 13 నుంచి పీఈసెట్, మే 20, 21 తేదీల్లో, 23వ తేదీన ఎడ్‌సెట్, 27వ తేదీన లాసెట్, 28నుంచి 31వ తేదీ వరకు పీజీ ఈసెట్ నిర్వహించాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో వాటన్నింటిని వాయిదా వేస్తున్నట్లు వివరించారు. మళ్లీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదించి తదుపరి ప్రకటన చేస్తామన్నారు. -
ఏపీ ఈసెట్-2019 ఫలితాలు విడుదల
-
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి:ఇంజనీరింగ్ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్ధులు తదుపరి ఉన్నత సాంకేతిక విద్యన కొనసాగించేందుక వీలుగా నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్-2019 ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు విజయవాడలో విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వైస్ఛైర్మన్లు ప్రొఫెసర్ పి.నరసింహారావు, ప్రొఫెసర్ టి.కోటేశ్వరరావు, ఈసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ శ్రీనివాస్ కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ భానుమూర్తి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి వరదరాజన్, ప్రత్యేకాధికారి డాక్టర్ రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ విజయరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 30న ఏపీ ఈసెట్‌ను నిర్వహించినట్లు వివరించారు. ఏపీ, తెలంగాణలో కలిపి 132 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు 39734 మంది దరఖాస్తు చేయగా 37749 మంది పరీక్ష రాసినట్లు వివరించారు. వీరిలో 37066 మంది (98.19 శాతం) ఉత్తీర్ణులైనట్లు వివరించారు. పరీక్ష రూ.200 మార్కులకు నిర్వహించగా అందులో 25 శాతం అంటే 50 మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించి ఉత్తీర్ణులను ప్రకటిస్తున్నామన్నారు. గత ఏడాదికన్నా 4వేల మంది అదనంగా ఈ ఏడాది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. మొత్తం 13 బ్రాంచులకు సంబంధించి ఈసెట్‌ను నిర్వహించామని విజయరాజు వివరించారు. గత ఏడాదిలోమిగిలిపోయిన వాటిని కలుపుకొని మొత్తం 50774 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హత సాధించిన వారు ఈనెల 19వ తేదీనుంచి హెచ్‌టీటీపీఎస్://ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఈసీఈటీ/‘ వెబ్సైట్ ద్వారా ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈసెట్‌లో ఆయా బ్రాంచులో మొదటి స్థానంలో నిలిచిన ర్యాంకర్లను ఛైర్మన్ ప్రకటించారు. సబ్జెక్టుల వారీగా ర్యాంకర్లు వీరే బయోటెక్నాలజీ: నాగబోయిన వెంకట అప్పారావు, సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా బీఎస్సీ మేథమెటిక్స్: కేశవరెడ్డి కాగితాల, విశాఖ సిరామిక్ టెక్నాలజీ: చిల్లకూరు కల్యాణ్, చిల్లకూరు, నెల్లూరు కెమికల్ ఇంజనీరింగ్: రొంగలి నిధిష్, పెందుర్తి, విశాఖపట్నం సివిల్ ఇంజనీరింగ్: శ్రీపెరంబదూరు ప్రణతి, హన్మకొండ, వరంగల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: విన్నకోట శ్రీవాణి, కాపువాడ, హన్మకొండ, వరంగల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: మహమ్మద్ ముబీన్, మల్కాజ్గిరి, మేడ్చల్‌జిల్లా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: ఖాత్రి సుజయ్ కుమార్, జాజపూర్, నారాయణపేట్, మహబూబ్ నగర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్: వీరవల్లి సాయి సీతారాం, ఇరగవరం, పశ్చిమగోదావరి జిల్లా మెకానికల్ ఇంజనీరింగ్: తపల్ షేక్ ఇంతియాజ్, ముద్దనూరు, కడప మెటలర్జికల్ఇంజనీరింగ్: రాయవరపు ముత్యాలనాయుడు, విశాఖపట్నం మైనింగ్ ఇంజనీరింగ్: దేవునూరి సాయి వెంకటరాజ్, రామగుండం, పెద్దపల్లి జిల్లా ఫార్మసీ: రామిశెట్టి సులోచన, సీతారామపురం నెల్లూరు -
ఈసెట్ కౌన్సెలింగ్‌కు 3,072 మంది
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఈసెట్–17 కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు 1 నుంచి 4 వేల ర్యాంకుల వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగగా.. 3,072 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 4,001 నుంచి 10 వేల వరకు ధ్రువ పత్రాల పరిశీలన శనివారం నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ వాణీప్రసాద్ తెలి పారు. ప్రత్యేక కేటగిరీకి (క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్) అభ్యర్థులు (1 నుంచి చివరి ర్యాంకు వరకు) శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని పేర్కొన్నారు. -
ఈసెట్ ఫలితాల్లో విద్యార్థిని ప్రతిభ
బుక్కరాయసముద్రం : మండలంలోని వడియంపేటలో ఉన్న శిరిడిసాయి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని సౌజన్య ఈసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 433 ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. విద్యార్థిని కళాశాలలో డిప్లమో కోర్సు చదువుతోందన్నారు. సందర్భంగా విద్యార్థినిని కళాశాల న్యూ మేనేజ్మెంట్, ఈసీఈ విభాగం అధిపతి మహేష్ అభినందించారు. -
ఈసెట్ రద్దు చేయాలి: కాంగ్రెస్
హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన నిర్వహించిన ఈసెట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇంత దరిద్రంగా ఎవరు, ఎప్పుడూ నిర్వహించలేదేమోనని, అభ్యర్థులకు, తల్లిదండ్రులకు దీనిపై అనుమానాలు ఉన్నాయని పీసీసీ అధికార ప్రతినిధి మహేష్ తెలిపారు. ఆన్లైన్ పరీక్ష అంటూ ఆ విధానానికే మచ్చ తెచ్చేలా నిర్వహణ ఉందని తెలిపారు. ఉదయం మొదలు కావాల్సిన పరీక్ష 5 గంటల ఆలస్యంగా ప్రారంభమయిందని చెప్పారు. విద్యా వ్యవస్థ, పరీక్ష వ్యవస్థ మీద నమ్మకం పోయేలా ఈసెట్ జరిగిందని దుయ్యబట్టారు. కొన్నిచోట్ల ఆఫ్‌లైన్ లో పరీక్ష నిర్వహించటం చూస్తే పేపర్ లీక్ అయందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఎంసెట్ లీకేజీ తర్వాత కూడా ప్రభుత్వం ఇంకా కళ్ళు తెరవకపోవడం ఇలాంటి సీఎం ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రికి తెలియకుండా టెండర్ ప్రక్రియ.. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తనకు నచ్చిన సంస్థకు ఇచ్చేశారని చెప్పారు. ఎంసెట్ లీకేజీ నుంచి పాపిరెడ్డి తప్పించు కున్నారు. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. ప్రభుత్వం తీరు సరిగా లేదని అనేక సార్లు చెప్పినా కూడా.. ఇంత ఘోరంగా పరీక్ష నిర్వహించినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. -
మే 5న ఏపీ ఎంసెట్
-
మే 5న ఏపీ ఎంసెట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇంటర్ విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా భావించే ఎంసెట్ తదితర పరీక్షల తేదీలు ఈ కింద విధంగా ఉన్నాయి.. ఏపీ సెట్ పరీక్ష తేదీలు ఎంసెట్ మే 5, 2016 (గురువారం) ఈసెట్ మే 9, 2016 (సోమవారం) ఐసెట్ మే 16, 2016 (సోమవారం) ఎడ్‌సెట్ మే 23, 2016 (సోమవారం) పీజీసెట్ మే 26, 2016 (గురువారం) లాసెట్ మే 28, 2016 (శనివారం) పీజీఎల్సీసెట్ మే 28, 2016 (శనివారం) పీఈసెట్ మే 9, 2016 (సోమవారం) -
ఈసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: కూకట్పల్లి జేఎన్టీయూలో శనివారం ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష) ఫలితాలు విడుదలయ్యాయి. కూకట్పల్లి జేఎన్టీయూలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఈ సెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం 91.87 గా నమోదయ్యింది. ఈ ఫలితాలలో బాలురే పై చేయి సాధించారు. -
నేడు టీఎస్ ఈసెట్ పరీక్ష
హైదరాబాద్ : తెలంగాణ ఈసెట్-2015 ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. నేరుగా ఇంజనీరింగ్ సెకెండియర్లో చేరేందుకు నిర్వహించే ఈసెట్ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. మొత్తం 38 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. అనంతరం 28 వరకు అభ్యంతరాల స్వీకరించి, మే 31న ర్యాంకులు వెల్లడిస్తారు. కాగా ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కోరారు. విద్యార్థులు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్, ఆన్లైన్ అప్లికేషన్‌పై ఫొటో అతికించి గెజిటెడ్ అధికారిచే సంతకం చేయించి తీసుకురావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు గెజిటెడ్ అధికారిచే సంతకం చేయించిన కుల ధ్రువీకరణ జిరాక్స్ పత్రాలు తీసుకొని రావాలని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి హడావిడి లేకుండా పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్షకు బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే తీసుకురావాలని కోరారు.