ఎక్కపల్లిలో రైతు హత్య
లింగంపేట, న్యూస్‌లైన్ :మండలంలోని ఎక్కపల్లి గ్రామానికి చెందిన నీలరామయ్య (60) అనే రైతు మంగళవారం హత్యకు గురయ్యా డు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామశివారులోని కొచ్చెరువు అలుగు కింది ప్రాంతంలో గల ఒర్రెపక్కన రామయ్య మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన కుటుంబసభ్యులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎల్లారెడ్డి సీఐ రామకృష్ణ, నాగిరెడ్డిపేట ఎస్సై అంజయ్య, లింగంపేట ఏఎస్సైలు కుమార్‌రాజా, లక్ష్మన్ సంఘటనా స్థలాన్ని పరి శీలించారు.
ఉదయం ఇంటి నుంచి పొలం కాపాలాకు వెళ్లిన రామయ్య రాకపోవడంతో కుటుంబసభ్యులు రాత్రి గాలిం చినా ఆచూకీ లభించలేదు. తిరిగి ఉదయం గాలించగా ఒర్రెపక్కన మృతదేహం లభించిందని అతని భార్య పోచవ్వ చెప్పారు. శవపంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా రామయ్య అనుమానాస్పదంగా మృతిచెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్య లు తీసుకుంటామని ఆయన తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు, నలుగురు కుమార్తెలున్నారు.
భూతగాదాలే కారణం ?
నీలరామయ్య హత్యకు భూతగాదాలే కారణమని, మృతుని కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు. భూముల విషయంలో పాలోల్లు కొందరు దశాబ్దకాలంగా ఘర్షణ పడుతున్నారని చెప్పారు. 2007లో రామయ్య ఇంటిని దగ్ధం చేయడంతో భార్యా పిల్లలతో కలిసి రామయ్య ఊరి విడిచి హైదరాబాద్‌కు వలస వెళ్లాడని గ్రామస్తులు తెలిపారు. కుమారుడు సిద్దయ్య ఎల్లారెడ్డిలో నివాసం ఉంటూ ఎక్కపల్లి గ్రామంలోని వ్యవసాయ పంటలను చూసుకునేవాడన్నారు. ఇటీవల తన పొలంలో బోరు వేసుకుని పంటలను సాగుచేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న రామయ్య కుటుంబసభ్యులతో రెండునెలల క్రితం తిరిగి వచ్చారు. ఎక్కపల్లి గ్రామానికి దగ్గరలో ఉన్న సజ్జన్‌పల్లిలో తన కూతురు వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ పొలాలకు కాపాలాగా ఉంటుండగా హత్యకు గురయ్యాడు.
అనుమానాలు..
నీలరామయ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామయ్య తలపై చెవి పక్కన కత్తి పోటు, మెడ భాగంలో చర్మం నల్లబడింది. రామయ్య శరీరంపై ఉన్న అరతులం బంగారుచెవి పోగు,15 తులాల వెండి దండ కడియాలు కనిపించకపోవడంపై కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. బంగారం, వెండి కోసమే హత్య చేసినట్లు నమ్మించేందుకు వాటిని నిందితులు తీసుకెళ్లారని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు.