అమ్మ చేతిలో బొమ్మలా..
► జీవచ్ఛవాన్ని చేసిన రోడ్డు ప్రమాదం
► నాలుగేళ్లుగా మంచానికేపరిమితం
► అన్ని పనుల్లో అమ్మే సాయం
► భిక్షాటన చేసి కొడుకు కడుపు నింపుతున్న తల్లి
► ఆపన్నహస్తం కోసం ఎదురు చూపు
నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసిన కొడుకు వృద్ధాప్యంలో తోడుంటాడని భావించిన ఆ తల్లి... జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన కొడుకు పరిస్థితిని చూసి కన్నీ రు మున్నీరవుతోంది. కదలలేని పరిస్థితిలో ఉన్న తన కుమారుడికి అన్నీ తానై సేవలందిస్తోంది. నిరుపేద కుటుంబం కావడంతో భిక్షాటన చేస్తూ కొడుకుకు బుక్కెడు ముద్ద పెడుతోంది. జీవించడానికి కనీసం ఇళ్లు కూడా లేని ఈ తల్లీ కొడుకులపై కథనం..
ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన రసూల్‌భీ– షరిఫోద్దీన్ దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి అంకుషావళి, రఫీ అనే ఇద్దరు కుమారులన్నారు.అంకుషావళి వివాహం అనంతరం అత్తవారింటివద్ద జీవనం సాగిస్తున్నాడు.ఇంతలోనే రసూల్‌భీ భర్త షరిఫోద్దీన్ మరణించాడు. చిన్న కొడుకు రఫీ హుజూరాబాద్‌లో తమలపాకులు అమ్ముతూ తల్లికి ఆసరాగా ఉండసాగాడు. 2008వ సంవత్సరంలో రఫీకి వివాహమైంది. 5 సంవత్సరాలు సాఫీగా సాగిన రఫీ జీవితాన్ని విధి పగపట్టింది.
2013వ సంవత్సరంలో ఇల్లందకుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రఫీ కాళ్లు, చేతులు, వెన్నెముక దెబ్బతిన్నాయి. దీంతో అవి చచ్చుబడి పోయాయి. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. అయనకు సేవలు చేయాల్సి వస్తుందని భార్య సైతం అతడిని విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తల్లే రఫీ బాగోగులు చూస్తోంది. కొడుకును బతికించుకోవడం కోసం ప్రతి రోజు భిక్షాటన చేస్తోంది. దాతలు సహకరిస్తే తన కుమారుడికి మెరుగైన వైద్యం చేయిస్తానని తల్లి రసూల్‌భీ కన్నీరు మున్నీరుగా విలపించింది.సాయం చేయాలనుకున్న వారు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 31604866407 కానీ 9863132461 సెల్‌కు సంప్రదించి చేయూతనందించాలని కోరుకుంటోంది.