210 చెట్లు నేల మట్టం
► గాలివానతో విద్యుత్ సరఫరాకు అంతరాయం
► చెట్లు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు
► రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ బృందాలు
► జీహెచ్ఎంసీ కమిషనర్ సుడిగాలి పర్యటన
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి సుమారు 210 చెట్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధాన మార్గాల్లో వాహన రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నాయి. రాత్రి నుంచే జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు రంగంలో దిగగా.. ఆదివారం ఉదయం సాక్షాత్తు జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి. జనార్థన్‌రెడ్డి రంగ ంలో దిగి నాలుగు గంటల పాటు పర్యటించారు. సెంట్రల్ జోన్ పరిధిలోని అబిడ్స్, సుల్తాన్ బజార్, సౌత్ జోన్ పరిధిలోని మలక్‌పేట, ఇమ్లిబన్ పార్క్, సైదాబాద్ ప్రాంతాల్లో పర్యటించి పనులను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ, విద్యుత్ తదితర బృందాలను అప్రమత్తం చేయడంతో హుటాహుటిన ప్రధాన మార్గాలపై కూలిన చెట్లను తొలగించారు.
కూలిన చెట్లు ఇలా..
సౌత్‌జోన్ పరిధిలో సుమారు 70 ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. నూర్ఖాన్ బజార్లో రెండు చెట్లు కూలి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పడ్డాయి. మరోవైపు నాలుగు చెట్లు కూలడంతో మూడు విద్యుత్ స్తంబాలు నేలమట్టమయ్యాయి. సెం ట్రల్ జోన్ పరిధిలో దాదాపు 70 ప్రాంతాల్లో చెట్లు కూలడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బాగ్ లింగంపల్లి, అబిడ్స్ ఎన్టీఆర్ నివాసం ఎదురుగా, రాంనగర్ తదితర ప్రాం తాల్లో చెట్ల కూలి ప్రధాన రోడ్లపై పడ్డాయి.
గోల్కోండ ఎక్స్ రోడ్లో చెట్లు కూలడంతో ప్రధానరహదారిపై తీవ్రంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈస్ట్‌జోన్ పరిధిలో 14 చెట్లు నేలమట్టమయ్యాయి. నార్త్‌జోన్ పరిధిలో 55 , వెస్ట్‌జోన్ పరిధిలో 5 చెట్లు కూలడంతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మొత్తం 19 ప్రాంతాల్లో నీరు నిలువగా వాటిని క్లియర్ చేశారు.
సౌత్‌జోన్‌కు అభినందనలు
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి పునరుద్ధరణ పనుల్లో చురుకుగా వ్యవహరించిన సౌత్‌జోన్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ కృష్ణ శేఖర్‌తో పాటు ఇంజనీరింగ్ సిబ్బందిని కమిషనర్ అభినందించారు.
కూలిన చెట్లను తొలగించాం: కమిషనర్
నగరంలో కురిసిన భారీ వర్షానికి కూలిన చెట్లన్నింటినీ రోడ్లపై నుండి పూర్తిగా తొలగించామని కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎమర్జెన్సీ బృందాలను రాత్రి నుంచే రంగంలో దింపి నగరవాసులకు ఇబ్బందులు గణనీయంగా తగ్గించగలిగామన్నారు. కొత్త పేట ఫ్రూట్ మార్కెట్లో పిడుగు పడి ఒకరు మరణించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. అధికారులు, సిబ్బంది స్పాంటేనియస్‌గా స్పందించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.