essential medicines
-
సామాన్యులకు ఊరట..తగ్గిన 651 మందుల ధరలు!
ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యుడికి కేంద్రం కాస్త ఊరట కల్పించింది. అత్యవసర ఔషధాల జాబితాలో ఉన్న 651 మందుల ధరలపై కేంద్రం సీలింగ్ ధరను నిర్ణయించింది. దీంతో ఈ ఔషధాల ధరలు దాదాపు 6.73 శాతానాకి దిగొచ్చాయి. గత ఏడాది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవీయ జాతీయ అత్యవసర ఔషధాల జాబితా- 2022ను విడుదల చేశారు. ఈ జాబితాలోకి చేర్చడం వల్ల పలు యాంటీబయోటిక్‌లు, వ్యాక్సిన్లు, క్యాన్సర్ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు అందుబాటులోకి రానున్నాయని, రోగులకు మందుల ఖర్చు తగ్గుతుందని మాండవీయ వెల్లడించారు. అయితే తాజాగా అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 870 రకాల మందుల్లో 651 ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం సీలింగ్ ధరను నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించిన సీలింగ్ ధరను మించి విక్రయించేందుకు అనుమతులు ఉండవు అని ఎన్పీపీఏ వెల్లడించింది -
మందులు వాడేవారికి ధరల దెబ్బ!
వివిధ రుగ్మతలతో బాధపడుతూ ఉపశమనం కోసం మందులు వాడుతున్నవారికి ధరల దెబ్బ తగలనుంది. పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటిబయాటిక్స్ వరకూ పలు రకాల మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్నాయి. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్లూపీఐ)లో మార్పునకు అనుగుణంగా ఏప్రిల్ 1 నుంచి పలు రకాల మందుల ధరలను 12 శాతం మేర పెంచుకోడానికి ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలకు అనుమతినిచ్చింది. ఇదీ చదవండి: అమ్మగా ఆలోచించి.. రూ. 50 కోట్లకు పైగా ఆదాయం.. ఈమె స్విమ్మింగ్ చాంపియన్ కూడా... ధరలు పెరుగుతున్న మందులలో చాలా వరకు యాంటీ ఇన్ఫెక్టివ్‌లు, పెయిన్కిల్లర్లు, కార్డియాక్ వంటి ప్రాణాలను రక్షించే మందులు ఉన్నాయి. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్‌లో చేర్చిన దాదాపు 800 ఔషధాల రిటైల్ ధరపై ఈ ధరల పెంపు ప్రభావం ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ జాబితాలో కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందుల దగ్గర నుంచి ఓఆర్ఎస్, డిస్ఇన్ఫెక్టెంట్ మందుల వరకు దాదాపు అన్ని అవసరమైన మందులు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే మందులు ఇవే... హాలోథేన్, ఐసోఫ్లోరేన్, కెటామైన్, నైట్రస్ ఆక్సైడ్ మొదలైన సాధారణ మత్తు మందులు, ఆక్సిజన్ మందులు. పెయిన్ కిల్లర్స్: డిక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, మెఫెనామిక్ యాసిడ్, పారాసెట్మాల్, మార్ఫిన్ పాయిజనింగ్‌లో యాంటీడోట్స్: యాక్టివేటెడ్ చార్కోల్, డి-పెనిసిల్లమైన్, నాలాక్సోన్, స్నేక్ వెనమ్ యాంటీసెరమ్ యాంటికాన్వల్సెంట్స్: క్లోబాజామ్, డయాజెపామ్, లోరాజెపామ్ పార్కిన్సన్స్, డిమెన్షియా: ఫ్లూనారిజైన్, ప్రొప్రానోలోల్, డోనెపెజిల్ యాంటీబయాటిక్స్: అమోక్సిసిలిన్, యాంపిసిలిన్, బెంజైల్పెనిసిలిన్, సెఫాడ్రోక్సిల్, సెఫాజోలిన్, సెఫ్ట్రియాక్సోమ్ కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందులు యాంటీ టీబీ ఔషధం: అమికాసిన్, బెడాక్విలిన్, క్లారిథ్రోమైసిన్ మొదలైనవి. యాంటీ ఫంగల్: క్లోట్రిమజోల్, ఫ్లూకోనజోల్, ముపిరోసిన్, నిస్టాటిన్, టెర్బినాఫైన్ తదితరాలు యాంటీవైరల్ మందులు: ఎసిక్లోవిర్, వల్గాన్సిక్లోవిర్ వంటివి. హెచ్ఐవీ చికిత్సకు వినియోగించే అబాకావిర్, లామివుడిన్, జిడోవుడిన్, ఎఫవిరెంజ్, నెవిరాపైన్, రాల్టెగ్రావిర్, డోలుటెగ్రావిర్, రిటోనావిర్ తదితర మందులు. మలేరియా మందులు: ఆర్టెసునేట్, ఆర్టెమెథర్, క్లోరోక్విన్, క్లిండామైసిన్, క్వినైన్, ప్రిమాక్విన్ మొదలైనవి. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 5-ఫ్లోరోరాసిల్, ఆక్టినోమైసిన్ డి, ఆల్-ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్, ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్, కాల్షియం ఫోలినేట్ మొదలైనవి. ఫోలిక్ యాసిడ్, ఐరన్ సుక్రోజ్, హైడ్రాక్సోకోబాలమిన్ వంటి రక్తహీనత మందులు ప్లాస్మా, ప్లాస్మా ప్రత్యామ్నాయాలు కార్డియోవాస్కులర్ మందులు: డిలిటాజెమ్, మెటోప్రోలోల్, డిగోక్సిన్, వెరాప్రమిల్, అమ్లోడిపైన్, రామిప్రిల్, టెల్మిసార్టెన్ మొదలైనవి. చర్మసంబంధమైన మందులు యాంటిసెప్టిక్స్, క్రిమిసంహారకాలు: క్లోరోహెక్సిడైన్, ఇథైల్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పోవిడిన్ అయోడిన్, పొటాషియం పర్మాంగనేట్ మొదలైనవి. బుడెసోనైడ్, సిప్రోఫ్లోక్సాసిన్, క్లోట్రిమజోల్ మొదలైన ఈఎన్టీ ఔషధాలు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మందులైన ఓఆర్ఎస్, లాక్టులోజ్, బిసాకోడిల్ వంటివి. హార్మోన్లు, ఇతర ఎండోక్రైన్ మందులు, గర్భనిరోధకాలు వ్యాక్సిన్లు: హెపటైటిస్ బి, డీపీటీ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాక్సిన్, మీజిల్స్ వ్యాక్సిన్, రేబిస్ వ్యాక్సిన్ మొదలైనవి. ఆప్తాల్మోలాజికల్ మందులు, ఆక్సిటోసిక్స్, యాంటీఆక్సిటోసిక్స్ మానసిక రుగ్మతల చికిత్సకు ఉపయోగించే మందులు శ్వాసకోశ సంబంధ రుగ్మతలకు వినియోగించే మందులు, విటమిన్లు, మినరల్స్. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? -
గుడ్ న్యూస్.. 70 శాతం వరకూ తగ్గనున్న ఔషధాల ధరలు!
న్యూఢిల్లీ: రోగులకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుక ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఔషధాల ధరలను తగ్గించనున్నట్లు సమాచారం. ప్రధానంగా క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్ వ్యాధులకు సంబంధించిన మందుల ధరల తగ్గనున్నాయి. దీనివల్ల రోగులకు భారీ ఉపశమనం లభించనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, ప్రకటనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. మందుల ధరలను నియంత్రించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అంతా అకున్నట్లు జరిగితే వాటి ధరలు 70 శాతం వరకు తగ్గిపోతాయని అధికారులు వెల్లడించారు. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియనల్ మెడిసిన్(ఎన్ఎల్ఈఎం)–2015ను సవరించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. రోగులు దీర్ఘకాలం ఉపయోగించే ఔషధాలపై హై–ట్రేడ్ మార్జిన్లపై పరిమితి విధించాలని యోచిస్తోంది. ఈ మేరకు పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు కూడా నిర్వహించింది. ఎన్ఎల్ఈఎంలో ఉన్న 355 మందుల ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఇప్పటికే పరిమితి విధించింది. కొన్ని రకాల షెడ్యూల్డ్ మెడిసిన్లపై ట్రేడ్ మార్జిన్‌ను హోల్‌సేల్ వ్యాపారులకు 8 శాతం, రిటైలర్లపై 16 శాతానికి పరిమితం చేసింది. ఇలాంటి మందుల తయారీదార్లు సీలింగ్ ప్రైస్ కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. మిగతా మందుల విషయంలో ఇలాంటి నియంత్రణలు ఏవీ లేవు. కంపెనీలు ఇష్టమొచ్చిన ధరలకు అమ్ముకోవచ్చు. ధరలను కంపెనీలే నిర్ధారించుకోవచ్చు. ధరల నియంత్రణ పరిధిలో లేని ఔషధాలపై ట్రేడ్ మార్జిన్లు ఎన్నో రెట్లు అధికంగా ఉంటున్నాయి. ఫలితంగా ఆ భారమంతా అంతిమంగా రోగులే భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కీలక ఔషధాలను నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తే వాటి ధరలు చాలావరకు తగ్గిపోతాయి. ఇదీ చదవండి: Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’ -
ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగు పరచండి
జనరిక్ మందుల అమ్మకానికి చర్యలు ఏపీ వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ కనకదుర్గమ్మ నర్సీపట్నం టౌన్ : రాష్ట్రంలో 30 ఆస్పత్రుల స్థాయి పెంపునకు చర్యలు చేపడుతున్నామని ఏపీ వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ పి.కనకదుర్గమ్మ తెలిపారు. క్షేత్రస్థాయి సర్వేలో భాగంగా జిల్లాలోని పలు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. చిన్న పిల్లల వార్డు ఆపరిశుభ్రంగా ఉండటంపై సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. డబ్బులు ఉండి ఆస్పత్రిలో అవసరమైన పరికరాలు ఎందుకు కొనుగోలు చేయలేదని సూపరింటెండెంట్ దొరను నిలదీశారు. గర్భిణుల ప్రాథమిక తనిఖీ సమయంలో ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపడం ద్వారా మాతా శిశు మరణాలు తగ్గించవచ్చని గైనకాలజిస్టులు డాక్టర్ సుధాశారద, విజయశాంతిలకు సూచించారు. ప్రసూతి విభాగంలో పుట్టిన వెంటనే బిడ్డలను సంరక్షించే విధానాలపై సరైన అవగాహన లేకపోవడాన్ని గుర్తించి, నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. అన్ని కేసులును విశాఖపట్నం రిఫరల్ కాకుండా సాధ్యమైనంత వరకు వైద్యం అందించాలన్నారు. మత్తు డాక్టర్ కొరత ఉన్నప్పుడు ఆస్పత్రి ఆభివృద్ధి నిధులతో అవుట్‌సోర్సింగ్‌లో నియమించుకోవచ్చన్నారు. దంత, కళ్లు విభాగంలో అవసరమైన పరికరాలు కొనుగోలుకు ఆదేశించారు. అత్యవసర వార్డులో అత్యావసర మందులు, పరికరాలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. పారిశుద్ధ్యానికి అవసరమైన వస్తువులను వినియోగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిని పరుగులెత్తించారు. కాంట్రాక్టర్ అమర్నాథ్తో ఫోన్లో మాట్లాడి పారిశుద్ధ్యం మెరుగు విషయంలో పద్ధతి మార్చుకోకపోతే పని మానేయండని హెచ్చరించారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో 30 ఆస్పత్రుల వరకు స్థాయిని పెంచేందుకు సిద్ధం చేసిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద ఉందన్నారు. ఏరియా ఆస్పుత్రుల్లో నిపుణులైన వైద్యుల కొరత అధికంగా ఉండడంతో. పిహెచ్సీల్లో పని చేస్తున్న నిపుణులైన వైద్యులను తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. జనరిక్ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమ్మేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆమె వెంట జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఎంపీపీ సుకల రమణమ్మ ఉన్నారు. వైద్యుల ఖాళీలు భర్తీ అనకాపల్లి టౌన్ : రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న 200కు పైగా వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ పి. కనకదుర్గమ్మ తెలిపారు. ఇక్కడి ఎన్టీఆర్ వందపడకల ఆస్పత్రిని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్యం నిర్వహణపైన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నర్సీపట్నం, కోటవురట్ల ఆస్పత్రులను కూడా పరిశీలించామన్నారు. అనకాపల్లి ఆస్పత్రిలో సిబ్బంది కొరతను తీరుస్తామన్నారు. 13 జిల్లాల్లో 118 వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులున్నాయని, వీటిలో స్పెషలిస్టుల కొరత ఉందని, వీటి భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా హెల్త్ సొసైటీ నుంచి ఆస్పత్రికి రూ.10 లక్షల వరకు ఆస్పత్రి అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించాలని వినతి ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ట్రెజరీ ద్వారా తమకు కూడా సకాలంలో జీతాలు చెల్లించాలని కోరారు. జనరల్ ట్రాన్స్ఫర్లు, హెల్త్ కార్డులు, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఏపీ వైద్య విధాన పరిషత్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎగ్జిక్యుటివ్మెంబర్ బి.ఎ. రామ్మూర్తి, జిల్లా ప్రెసిడెంట్ ఎ. సింహాచలం, జనరల్ సెక్రటరీ బి.సోమేశ్వరరావులు ఉన్నారు.