ఆమె కోసం రూ.2కోట్లతో జైల్లో స్పెషల్ కిచెన్
జైలులోనూ చిన్నమ్మకు రాచమర్యాదలు.. వీఐపీ ట్రీట్మెంట్
చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళకు జైల్లోనూ రాచమర్యాదలు దక్కుతున్నాయి. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఆమెకు స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తోంది. ఆమెకు నచ్చిన ఆహారం అందించేందుకు జైల్లో ఏకంగా ప్రత్యేక వంటగదిని ఏర్పాటుచేశారు. ఇందుకోసం ఏకంగా రూ. రెండు కోట్లను జైలు అధికారులకు లంచంగా ఇచ్చారు. జైలులో శశికళకు లభిస్తున్న వీఐపీ మర్యాదలపై సీనియర్ జైలు అధికారి డీ రూప రూపొందించిన నివేదికలో వెలుగుచూసిన వాస్తవాలివి.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లో ఈ శిక్ష అనుభవిస్తున్న శశికళ తనకు కారాగారంలో సకల సౌకర్యాలు లభించేందుకు వీలుగా రూ. 2 కోట్లు జైలు అధికారులకు లంచం చెల్లించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఈ వ్యవహారంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీపీ హెచ్ఎన్ సత్యనారాయణరావుకు సైతం ముడుపులు అందాయని వినిపిస్తోందని ఆమె తన నివేదికలో పేర్కొన్నారు. అందుకే జైల్లో శశికి ప్రత్యేక మర్యాదలు దక్కుతున్నా ఆయన చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 10న పరప్పన అగ్రహార జైలులో తనిఖీలు నిర్వహించిన జైళ్లశాఖ డీఐజీ రూప ఈ మేరకు తన నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు.