భళా.. చిత్రకళ..!
► వైవీయూలో అబ్బురపరిచిన ప్రదర్శన
► ప్రారంభించిన వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం లలిత కళల విభాగం బీఎఫ్ఏ చివరి సంవత్సరం విద్యార్థులు వేసిన చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శుక్రవారం వైవీయూ లలితకళల విభాగం ఆధ్వర్యంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైవీయూ విద్యార్థులు చక్కటి ప్రదర్శన ఏర్పాటు చేశారన్నారు. రాయలసీమలో ఏకైక లలితకళల విభాగం విశ్వవిద్యాలయంలో ఉండటం గర్వకారణమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతో పాటు భావోద్వేగాలను అదుపులో ఉంచే గొప్ప ఔషదంగా ఆయన అభివర్ణించారు. వైవీయూ లలిత కళల విభాగం దక్షిణభారత దేశంలోనే మేటి నిలవాలని ఆకాంక్షించారు. వైవీయూ ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, విప్రో ఫైర్ అండ్ సేఫ్టీ కర్నూలు విభాగం అధిపతి రామాంజినేయులు విచ్చేసి ఈ ప్రదర్శనను తిలకించారు.
కాగా ఈ ప్రదర్శనలో 60 కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఫైన్ఆర్ట్స్ విద్యార్థి చిన్నరాయుడు, లోకేష్నాయుడు, వరలక్ష్మి, దివ్య, నారాయణస్వామి తదితరులు వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. కాగా కార్యక్రమాన్ని లలితకళల విభాగం సహాయ ఆచార్యులు కోట మృత్యుంజయరావు పర్యవేక్షణలో, లలితకళళ విభాగం సమన్వయకర్త డా. మూల మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం మనోహర్, సంతోష్, సునీతలు పాల్గొన్నారు.