భారత వ్యాపారి మంచి మనసు
యూఏఈలో ఖైదీల విడుదలకు 6.71 కోట్లు సాయం
దుబాయ్: యూఏఈ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించేందుకు 6.71 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు దుబాయ్‌లోని భారత సంతతికి చెందిన వ్యాపారి ఫిరోజ్ మర్చంట్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత అజ్మాన్ సెంట్రల్ జైలు నుంచి 132 మంది ఖైదీల విడుదలకు రూ.2.78 కోట్లు చెల్లించారు. రుణాలు చెల్లించలేని వారు, తమ శిక్షా కాలం ముగిసినా స్వదేశం తిరిగి వెళ్లేందుకు డబ్బులు లేక అక్కడే ఉంటున్న వారికి సాయం చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
విమాన ప్రయాణ టికెట్లతోపాటు, జైళ్ల నుంచి విడుదలైన వారు క్షేమంగా ఇంటికెళ్లేలా వాళ్ల స్థానిక కరెన్సీకి సమానమైన మొత్తాన్ని కూడా మర్చంట్ కార్యాలయం ఇస్తుంది. ‘ పరిస్థితుల వల్లే వారంతా బాధితులయ్యారు. నిజమైన నేరగాళ్లు కాదు. రుణ సంబంధ కారణాలతోనే చాలా మంది జైలు జీవితం గడుపుతున్నారు. అందుకే వారిని సొంతగడ్డకు పంపడానికి నాకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నా’ అని మర్చంట్ అన్నారు.