చెదిరిన గుండె లకు..కొండంత ఓదార్పు
జిల్లాలో పర్యటించిన జననేత జగన్
బాధిత మత్స్యకార కుటుంబాలకు పరామర్శ
వారిపట్ల సర్కారు ఉదాసీనతపై ఆగ్రహం
తాము అండగా ఉంటామని భరోసా
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లాలో ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లి వాయుగుండం కారణంగా మృతి చెందిన, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను గురువారం జగన్ ఓదార్చారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మూసాయిపేటలో పర్యటన ముగించుకొని సాయంత్రం 5 గంటలకు జగన్ తుని వచ్చారు. ఈ సందర్భంగా తాండవ బ్రిడ్జిపై జగన్‌కు పార్టీ నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆయన పర్యటన అన్నవరం, గోపాలపట్నం, ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం, తొండంగి, వంటిమామిడి, కొత్తపాకల, గడ్డి పేట, బుచ్చియ్యపేటల మీదుగా పెరుమాళ్లపురం, హుకుంపేట, కోనపాపపేట, మూలపేట, ఉప్పాడల మీదుగా సాగింది. అడుగడుగునా తీర ప్రాంత మత్స్యకారులు అభిమానంతో జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడి పలకరించారు. కొత్తపాకలలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిలువెత్తు విగ్రహానికి జగన్ పూలమాలలువేసి నివాళులు అర్పించారు. గడ్డిపేటలో కాకినాడ ఎస్ఈజడ్ పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలసి జగన్‌కు నివేదికను అందజేశారు.
తగిన పరిహారం ఇవ్వకుంటే భూములు తిరిగివ్వండి..
పెరుమాళ్లపురం బహిరంగ సభలో జగన్ చేసిన ప్రసంగం తీర ప్రాంత మత్స్యకారుల్లో భరోసానిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా రాష్ట్రమంత్రులు బాధిత మత్స్యకారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారంటూ జగన్ నిప్పులు చెరిగిన సమయంలో స్థానికులు ఒక్కసారిగా కరతాళ ధ్వనులు చేశారు. కాకినాడ సెజ్ విషయంలో ముఖ్యమంత్రి కాకముందు, అయ్యాక చంద్రబాబు వ్యవహారశైలిని జగన్ ఎండగట్టారు. ‘ఎకరానికి రూ.70 లక్షలు అయినా ఇవ్వండి, లేదా రైతుల భూములు వారికి వెనక్కి ఇచ్చేయండి’ అని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుమాళ్లపురం సెంటరు జగన్ కోసం తరలి వచ్చిన మత్స్యకారులతో కిక్కిరిసిపోయింది.
అక్కడ నుంచి ఆయన పాత పెరుమాళ్లపురానికి చెందిన చొక్కా రాజు, చొక్కా పెంటయ్య, సింహాచలం, మేరుగ బాబూరావు కుటుంబాలను పలకరించి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. ‘మీ వెంట మేముంటామని’ వారికి భరోసా కల్పించారు. అనంతరం హుకుంపేటలో తిత్తి అప్పలరాజు, అత్తిలి రాజుబాబు, కోడా లోవరాజు కుటుంబాలను ఓదార్చారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెం, కొత్తపట్నం మత్స్యకార గ్రామాల్లో పంతాడ సూరిబాబు, పట్టా సూర్యారావు కుటుంబాలను పలకరించి పార్టీ తరఫున మీకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఉప్పాడ నుంచి బీచ్‌రోడ్డు మీదుగా జగన్ అర్ధరాత్రి 12.18 గంటలకు కాకినాడ చేరుకుని, బస చేశారు.
జగన్ నేటి పర్యటన వివరాలు
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 9 గంటలకు కాకినాడ దేవాలయంవీధిలోని పార్టీ నాయకులు నిర్మల్ జైన్ నివాసం నుంచి బయలుదేరి బాలాజీ చెరువు, పైండా సత్తిరాజు బాలికోన్నత పాఠశాల, కల్పనా సెంటర్, ప్లై ఓవర్ మీదుగా పర్లోపేట వెళతారు. అక్కడ తుఫాన్ కారణంగా మృతి చెందిన మత్స్యకారుని కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. అక్కడినుంచి కాకినాడ జగన్నాథపురం వెళ్లి ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ చామకూర ఆదినారాయణ(నాగబాబు) కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
తదుపరి కాకినాడరూరల్ నియోజకవర్గం పగడాలపేట వెళతారు. అనంతరం జగన్మోహన్రెడ్డి కాకినాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12గంటలకు జిల్లా ఏజెన్సీలోని గంగవరం మండలం పాతరామవరం చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తారు. పాతరామవరం నుంచి పి. నెల్లిపూడి, సీహెచ్. నెల్లిపూడి, కొత్త నెల్లిపూడి మీదుగా కొత్తాడ చేరుకుంటారు. కొత్తాడలో మృతుడు శారపు అబ్బులుదొర కుటుంబాన్ని ఆయన ఓదారుస్తారు. అనంతరం కొత్తాడ నుంచి సూరంపాలెం చేరుకొని ఎనిమిది మంది మృతుల కుటుంబాలను , క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం సూరంపాలెం రిజర్వాయర్ సమీపంలో రంపచోడవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు.