వామ్మో.. పూల బిల్లే.. 3.34 లక్షలు!
చంద్రబాబు కార్యాలయం ఫ్లవర్ డెకరేషన్ ఖర్చు ఇది..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ప్రారంభోత్సవం రోజున దాన్ని పూలతో అలంకరించడానికి ఖర్చు ఎంతయిందో తెలుసా? కొన్ని గంటల కోసం ఆ కార్యాలయాన్ని పూల మాలలతో అలంకరించడానికి అక్షరాలా 3.34 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉన్న ఎల్ బ్లాకులోని 8వ ఫ్లోర్లో సీఎం చంద్రబాబు కార్యాలయం ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పటికే రూ. 15 కోట్లు ఖర్చు చేసి సర్వ హంగులూ సమకూర్చారు. ఇక ఈ కార్యాలయంలో చంద్రబాబు అడుగుపెట్టే వేళ దాన్ని అలంకరించడానికి పూల కోసం 3,34,850 రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేశారు.
గత నెల 3న చంద్రబాబు అందులో అడుగు పెట్టారు. ఆరోజు పూల కోసం అయిన ఖర్చును ప్రోటోకాల్ విభాగం రూ. 3,34,850గా లెక్క తేల్చింది. వాటిని సమకూర్చిన హైదరాబాద్లోని ఫూల్ మహల్ నిర్వాహకులు ఈ మొత్తానికి బిల్లు సమర్పించారు. ఈ బిల్లు మంజూరు చేస్తూ శనివారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేకుండా ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు జీవోలో పేర్కొన్నారు.