Friends of Snake Society
-
నాగరికం
ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ నాలుగు రోజుల క్రితం పటాన్చెరు దగ్గర ఒకరింట్లోకి పాము వచ్చింది. అందరూ కర్రలు తీసుకుని దాన్ని చంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి ఓ అబ్బాయ్ అడ్డుపడ్డాడు. అదే ప్రాంతంలో ఉన్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యుడు జె. శ్రీనివాస్‌కి ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న శ్రీనివాస్ ఒడుపుగా ఆ పామును పట్టుకుని ఒక బ్యాగులో వేసుకుని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి తీసుకెళ్లాడు. చూడటానికి పసుపు రంగులో ఉన్న ఆ పామును ‘ఇండియన్ ఎగ్ ఈటర్’గా గుర్తించారు. చాలా అరుదుగా కనిపించే ఆ పాము జాతిని పదిలంగా కాపాడుకోవాలంటున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యుల్ని పలకరిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. పాముల నుంచి మనుషులను.. మానవాళి నుంచి పాములను కాపాడటానికి పుట్టిందే ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’. సుమారు 20 ఏళ్ల కిందట రాజ్‌కుమార్ కనూరి దీన్ని ప్రారంభించాడు. ఒక్కరితో మొదలైన ఈ సంస్థలో ఇప్పుడు వంద మంది సభ్యులున్నారు. ఇందులో డాక ్టర్, ఇంజనీర్, లాయర్, టీచర్ , విద్యార్థులు ఇలా.. అన్ని రంగాలవారు ఉన్నారు. నగరంలో పాములను కాపాడే నాగరికతను పెంచుతున్న ఈ సొసైటీ గతేడాది 2,600 పాములను కాపాడింది. ఆక్రమణ మనదే.. ‘మన నివాసాల్లోకి పాములు రావడం లేదు.. పాముల ఆవాసాల నే మనం కబ్జా చేస్తున్నాం’ అని అంటున్నారు ఈ స్నేక్ ఫ్రెండ్స్. ‘పాములు నివసించే ప్రాంతాలకు వెళ్లి పుట్టలను పడగొట్టి, అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాం. ఇక అవి ఇళ్లలోకి రాక ఏం చేస్తాయి ? హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పటాన్చెరు ప్రాంతాల నుంచి మాకు కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతున్న ప్రాంతాల్లోనే పాములు జనాల మధ్యకు వస్తున్నాయి. వాటి రక్షణ బాధ్యత మనదే అనుకున్నవారు మాకు ఫోన్ చేస్తున్నారు. లేదంటే చంపేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు ఈ సొసైటీ సభ్యుడు అవినాశ్. రక్షకులు... సొసైటీలోని సభ్యుల నివాసాలను బట్టి ప్రాంతాలవారీగా పాముల రక్షణ బాధ్యతలను పంచుకుంటారు. రోజూ పట్టుకుని వచ్చిన పాములను మల్కాజ్‌గిరిలోని సొసైటీ ఆఫీస్‌లో ఉంచుతారు. నెల రోజులకోసారి ఈ పాములను తీసుకెళ్లి సిటీకి దూరంగా ఉన్న అడవుల్లో వదిలేస్తారు. ఈ సొసైటీ కార్యాలయంలో ఇప్పుడు ఇరవై పాముల వరకూ ఉన్నాయి. వాటికి ఎప్పుడూ ఇద్దరు సభ్యులు కాపలా ఉంటారు. పాముల రక్షణ మన బాధ్యత అని గుర్తించిన వారు ఈ సొసైటీలో సభ్యులుగా చేరుతుంటారు. వీరికి పామును ఎలా పట్టుకోవాలో సీనియర్ సభ్యులు శిక్షణ ఇస్తారు. ‘పాములు ఎవరికీ ఏ హాని తలపెట్టవు. ఏళ్లుగా మేం కొన్ని వేల పాములను పట్టుకున్నాం. అవి హాని చేసిన సందర్భాలు లేవు’ అని చెబుతారు మరో సభ్యుడు వరుణ్ వైష్ణవ్. ఇష్టంతోనే... పాములపై ఇష్టంతో సినీనటుడు సాయికిరణ్ ఈ సొసైటీలో చేరాడు. ఏడేళ్లలో మూడువేల పాములను రక్షించారు కూడా. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పాము వచ్చిందని సమాచారం అందిన వెంటనే సాయికిరణ్ అక్కడ వాలిపోతారు. ఈ ప్రాంతాల్లోని సినీప్రముఖుల ఇళ్లలో పాము కనిపిస్తే వెంటనే మనోడికి కాల్ వస్తుంది. ‘కనిపించిన పాములను చంపుతూ పోతే భవిష్యత్తు తరాలకు పాములను టీవీల్లోనూ, కంప్యూటర్లోనో చూపించాల్సి ఉంటుంది. అందుకే వాటి రక్షణకు అందరూ ముందుకు రావాలని’ అంటారు సాయికిరణ్. ఆడించడమూ నేరమే... నాగుల పంచమి, చవితి పండుగలకు పాములను ఆడించే వారి నుంచి వాటిని రక్షించే బాధ్యతను భుజానికెత్తుకుంది ఈ సొసైటీ. ‘పాములు ఆడించడం నేరం, అలా చేసిన వారికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా ఉంటుంది. నిజానికి పాములు పాలు తాగవు. కానీ పాములు ఆడించే వారు పండుగలకు కొన్ని రోజుల ముందు నుంచి వాటి కోరలు తీసేసి.. మూతి కుట్టేసి.. కనీసం మంచినీళ్లు ఇవ్వకుండా మాడుస్తుంటారు. పండుగ రోజున బుట్టల్లో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి ఆడిస్తారు. తర్వాత వాటిని తీసుకెళ్లి బతికుండగానే వాటి చర్మం వలుచుకుంటారు. నాగుపాము సెంటిమెంట్‌తో వారు పాములను హింసించే తీరు దారుణంగా ఉంటుంది. అందుకే ఈ పండుగల సమయంలో వారిపై ప్రత్యేక దృష్టి పెడతాం. అలా దొరికిన పాములకు వైద్యం చేయించి, తిరిగి కోరలు వచ్చాక తీసుకెళ్లి అడవుల్లో వదిలేస్తాం’ అని చెప్పారు అవినాష్. కోరల్లో విషాన్ని దాచుకున్న పాములు కూడా మూగజీవాలే. వీటిని కాపాడటానికి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యులు చేస్తున్న ప్రయత్నానికి అందరూ సెల్యూట్ చేయాలి. - భువనేశ్వరి -
ఓ ముప్ఫైసార్లయినా పాముతో కరిపించుకోవాల్సి ఉంటుంది!
పాములంటే అందరికీ భయమే. కానీ నటుడు సాయికిరణ్ మాత్రం స్నేక్లతో స్నేహం చేస్తారు. హైదరాబాద్‌లోని ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’లో కీలక సభ్యుడాయన. ఎక్కడ పాము కనపడ్డా దాన్ని ఒడుపుగా పట్టుకుని ఏ అడవిలోనో వదిలేసి వస్తారు. ఈ స్నేక్‌ల స్నేహితుడు చెప్పిన స్వీయానుభవాలు ఆసక్తికరం... ఓ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్... లిఫ్ట్ చేయగానే ‘హలో... సాయికిరణా? నేను నాగార్జునను మాట్లాడుతున్నాను’ అన్నారు. ఎవరో మిమిక్రీ చేసి ఆటపట్టిస్తున్నారనుకున్నాను. ‘ప్లీజ్ బాస్....మీరెవరో చెప్పండి’ అన్నాను. ‘నేనేనయ్యా...అక్కినేని నాగార్జునను’ అని అన్నారు. షాక్ నుంచి తేరుకుని ‘చెప్పండి సార్...’ అన్నాను. ‘కారులో పాము ఉంది. శ్రీహరి ఇంటికి ఎదురుగా రోడ్డుపై పక్కనే ఆపాను. వెంటనే రాగలవా?’ అన్నారు. పావుగంటలో అక్కడున్నాను. బ్లూక్రాస్ పని మీద అమలగారు ఎక్కడికో వెళితే అక్కడ ఒక త్రాచుపాము కనిపించిందట. ఎవరైనా చంపేస్తారని, దాన్ని పట్టించి, ఒక బ్యాగులో వేసుకుని నాకు ఇద్దామని తెచ్చారట. ఆ బ్యాగుని అమలగారు కారులో వదిలి లోపలికి వెళ్లడం. ఇంతలో ఆ కారు తీసుకుని నాగార్జునగారు బయటకి రావడం జరిగింది. ఆ బ్యాగు ముడి సరిగ్గా వేయకపోవడంతో, పాము కాస్తా బయటకు వచ్చి కారు వెనకసీట్లో పడగ విప్పి ఆడుతోంది. నాగార్జునగారు వెంటనే అమలగారికి ఫోన్ చేస్తే, ఆవిడ నా నెంబర్ ఇచ్చారు. తీరా కారులో పాము కనిపించలేదు. మెకానిక్‌ని పిలిచి, కారు సీట్లు, కార్పెట్...అన్నీ విప్పేయించాం. ఆ పాము కారు బాడీలోకి దూరిపోవడంతో పట్టుకోవడం కష్టమైంది. పట్టుకున్న తర్వాత అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఏడేళ్ల వయసులో... చిన్నప్పుడు సైన్స్టీచర్ వానపాముల్ని పట్టుకుని మొక్కల మొదలు దగ్గర వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయని చెప్పేవారు. అది విని, వానపాముల్ని పట్టుకోవడంతో మొదలైంది నా పాముల వేట (నవ్వుతూ...). ఒకసారి నా ఏడేళ్ల వయసులో ఇంటి పెరట్లో స్క్రూడ్రైవర్‌తో మట్టి తవ్వుతుంటే చాలా వానపాములతో పాటు ఇంకో పాము కూడా వచ్చింది. దాన్ని పట్టుకోగానే నా బొటనవేలుకి చుట్టేసుకుని పడగ విప్పి చూస్తోంది. ఈ పామేదో భలేగా ఉందని అమ్మమ్మను పిలిచి చూపిస్తే, పనివాళ్లను పిలిచి చంపేయించింది. నాకు చాలా బాధ అనిపించింది. ‘పామును మొక్కల మొదలు దగ్గర వేసి మట్టి పోయాలి కానీ, అలా కొట్టకూడదని ఏడవడం మొదలెట్టాను. ‘అది గనక కరిస్తే చచ్చిపోతావ్...’ అంది అమ్మమ్మ. ‘అది నన్ను కరవలేదు కదా!’ అన్నాను. దానికి సమాధానం లేదు. అంతే! ఆ రోజు నుంచి రెండేళ్ల వరకూ నన్ను మొక్కల్లోకి వెళ్లనిస్తే ఒట్టు. పాములకు దూరం చేశారు కానీ వాటిపై నాకున్న ప్రేమకు మాత్రం దూరం చేయలేకపోయారు. దానికి తోడు నేను శివభక్తుణ్ణి. దేవుణ్ణి పూజిస్తున్నంతసేపు ఆయన మెడలోని పామునే చూస్తుంటాను. ‘యాక్సిడెంట్’ కలిపింది చిన్నప్పటి నుంచి పాములపై నాకున్న అభిమానం మనసులోనే ఉండిపోయింది. చదువు, ఆ తర్వాత నటన.... చాలా బిజీ అయిపోయాను. ‘నువ్వే కావాలి’ షూటింగ్ సమయంలో అనుకోకుండా ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’ వాళ్లతో పరిచయం ఏర్పడింది. పాముల సంరక్షణ కోసం వారు చేస్తున్న సేవ గురించి తెలియగానే వెంటనే ఆ సొసైటీలో సభ్యుడిగా చేరిపోయాను. మొదటి కాటు ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు... ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’ సభ్యుల్లో ఎవరు దగ్గరగా ఉంటే వారు వెంటనే స్పందిస్తారు. ప్రస్తుతం ఆ సొసైటీలో 60 మంది సభ్యులున్నారు. ఒకరోజు పొద్దునే హైదరాబాద్‌లోని మహేంద్రాహిల్స్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికి ముందు రోజు సాయంత్రం మా ఇంటి దగ్గర ఒక త్రాచుపామును పట్టుకున్నాను. దాన్ని సొసైటీ దగ్గర వదిలిపెడదామనుకుని బయలుదేరే ముందు మహేంద్రాహిల్స్ దగ్గర నుంచి ఫోన్‌కాల్. సరేనని ఈ పామును కూడా తీసుకుని అక్కడికి బయలుదేరాను. అక్కడి పాము జెర్రిగొడ్డు. దాన్ని పట్టుకుని త్రాచుపామున్న బ్యాగులోనే వేశాను. సాధారణంగా ఒక బ్యాగులో మూడు నాలుగు పాములు పడతాయి. అయితే ఈ రెండు పాములు బాగా పెద్దవి కావడం వల్ల జెర్రిగొడ్డును బ్యాగులోకి వేస్తుంటే స్థలం సరిపోక, అందులో ఉన్న త్రాచుపాము బయటకు వచ్చేస్తోంది. ఆ సంగతి సరిగ్గా గమనించుకోకుండా రెండో పామును లోపలికి తోస్తుంటే త్రాచుపాము నా చేతిపై కాటేసింది. వెంటనే కారెక్కి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లిపోయాను. అరగంట కారు ప్రయాణం...చాలా ఆందోళనతో గడిచింది. చేతి మణికట్టుపై నుంచి విషం మెల్లగా భుజంవరకూ పాకడం చాలా స్పష్టంగా తెలిసింది. అన్ని పాముల విషం తెలియదు కానీ త్రాచుపాము విషం పైకి వెళ్లడం తెలుస్తుంది. ఆ నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది. నిప్పుతో చేతిపై మెల్లగా రాస్తున్నట్టు ఉంటుంది. పాముకాటు బాధితులు ఆసుపత్రికి వెళ్లగానే ముందుగా బ్లడ్ టెస్ట్ చేస్తారు... ఎందుకంటే మన రక్తంలో విషం ఉందో లేదో నిర్ధారించుకోవడం కోసం. లేదంటే వారిచ్చే విరుగుడు ఇంజెక్షన్ వల్ల మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక నా విషయంలో ఆ బ్లడ్‌టెస్ట్ అవసరం లేదని చెప్పాను. ఎందుకంటే అప్పటికే చాలా సమయం గడిచిపోయింది. ఓ పక్క కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ‘మిమ్మల్ని కరిచింది త్రాచుపామేనని గ్యారెంటీ ఏంటి’ అని డాక్టర్ అడగ్గానే...‘కరిచిన పాము నా దగ్గరే ఉంది. చూపించమంటారా...’ అని గట్టిగా చెప్పేసరికి వెంటనే వైద్యం మొదలుపెట్టారు. ఆ రోజు మాత్రం చావు దగ్గరి వరకూ వెళ్లిన ఫీలింగ్ కలిగింది. మూడువేల పాములు ఇప్పటివరకూ ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’ సభ్యుడిగా 3 వేల పాముల్ని పట్టుకున్నాను. పట్టిన ప్రతి పామునూ వెంటనే సైనిక్‌పురిలో ఉన్న ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’లో ఉంచుతాం. ఓ ఇరవై పాములయ్యాక అటవీ అధికారుల సూచనల మేరకు అడవులకు తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాం. మేము ఎక్కువగా శ్రీశైలం అడవుల్లో మనుషులు సంచరించని ‘పులిచెరువు’ ప్రాంతంలో ఈ పాముల్ని వదిలేస్తాం. - భువనేశ్వరి