గాజువాక గణేశుని లడ్డూ 12.5 టన్నులు
మండపేట: వినాయక చవితి సందర్భంగా భారీ లడ్డూల తయారీలో పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ సంస్థ 12,500 కిలోల లడ్డూను తయారు చేసి గిన్నిస్ రికార్డును నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది.
శుక్రవారం తాపేశ్వరంలో సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు విలేకరులతో మాట్లాడుతూ.. గతేడాది గుజరాత్లోని అరసూరి అంబాజిమాత దేవస్థానం ట్రస్టు తయారుచేసిన 11, 115 కిలోల లడ్డూ ఇప్పటి వరకు గిన్నిస్ రికార్డుగా ఉందని, ఆ రికార్డును తాము అధిగమించనున్నట్లు తెలిపారు. 12,500 కిలోల లడ్డూను తయారు చేసి విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఏర్పాటు చేస్తున్న మహా గణపతికి సమర్పిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథునికి 500 కిలోల లడ్డూ మాత్రమే పంపిస్తున్నామన్నారు. 12.5 టన్నుల లడ్డూ తయారీకి సుమారు రూ.30 లక్షలు అవుతుందన్నారు.