వధువే.. వరుడై..
పెళ్లి పందిరి వేశారు. బంధువులంతా వచ్చారు. మేళతాళాలు మోగుతున్నాయి. ఊరేగింపుగా వెళ్లి గంగానమ్మను దర్శించుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు. ఇంతలో పెళ్లి పెద్దల్లో ఒకరు ‘వధువును త్వరగా తీసుకు రండర్రా’ అన్నారు. అంతే.. నెత్తిన టోపీ.. కళ్లకు సన్‌గ్లాస్, ఫుల్ హ్యాండ్స్ షర్ట్, జీన్ ప్యాంటు, మెడలో కండువా ధరించి ఓ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇంతకీ.. అతను వరుడు కాదు.. అక్షరాలా వధువు. తమ వంశ ఆచారం ప్రకారం వరుడి వేషధారణలో వధువు దర్శనమిచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో గురువారం ఈ విశేషం చోటుచేసుకుంది. వివాహం జరిగే రోజున ఇలా వధువు గ్రామంలోని గంగానమ్మ ఆలయానికి వెళ్లి దర్శించుకోవడం గన్నమని వంశీకుల ఆచారం.దీంతో పోతవరానికి చెందిన గన్నమనేని వెంకటేశ్వరావు రెండో కుమార్తె సౌమ్య సంప్రదాయ వేషధారణలో వెళ్లి గంగానమ్మను దర్శించుకుని పూజలు జరిపి వచ్చింది. - నల్లజర్ల రూరల్