సమతూకం తప్పుతోంది!
మన దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో ఐదేళ్లలోపు బాలికల మరణాలు అధికంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ప్రతి రెండు జిల్లాల్లో ఒక జిల్లాలో శిశు మరణాలు అత్యధికంగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది.
భారతదేశంలో ప్రతి యేడాది దాదాపు 2,39,000 మంది ఆడపిల్లలు లింగ వివక్ష కారణంగా మృత్యువు దరికి చేరుతున్నారంటే మన అభివృద్ధి అంకెలకూ దీనికీ లింకెక్కడా అనిపిస్తోంది! కారణాలేవైనా ఐదేళ్లు నిండకుండానే మన దేశంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఆడపిల్లలు ‘అదృశ్యమై’పోతున్నారు. మగపిల్లవాడు కావాలనే కోరిక, ఆడపిల్ల పెంపకం ఉన్న భయ భావం, పురుషాధిపత్య భావజాలం.. పసిబిడ్డలను మొగ్గలోనే చిదిమేస్తోంది. ఆడపిల్లల భ్రూణ హత్యలు.. మళ్లీ వేరు లెక్కలవి.
పుట్టిన తర్వాత కూడా!
ఇప్పటివరకూ అంతా అనుకుంటున్నట్టు ‘‘లింగ వివక్ష ఆడపిల్లల పుట్టుకను నివారించే అబార్షన్లకు, ఆడపిల్లల భ్రూణ హత్యలకు మాత్రమే పరిమితం కాలేదనీ, ఆడపిల్ల పుట్టుక అనంతరం కూడా వారిని చంపేసే హేయమైన చర్యలు మన భారత దేశంలో కోకొల్లలని’’ ఈ పరిశోధనకు సహ అధ్యయనవేత్తగా ఉన్న పారిస్ డెస్కరేట్స్ యూనివర్సిటీ కి చెందిన గుయిల్‌మోటో అభిప్రాయపడ్డారు. ‘‘స్త్రీపురుష సమానత్వం కేవలం విద్యాహక్కు కోసమో, లేక సమాన ఉపాధి అవకాశాల కోసమో, లేదంటే రాజకీయ ప్రాతినిధ్యం కోసమో మాత్రమే కాదు, ఇది పిల్లల సంరక్షణకు, వాక్సినేషన్‌కీ, పౌష్టికాహారానికీ, మొత్తంగా వారి ఆరోగ్యానికి, చివరగా వారి ప్రాణాల పరిరక్షణకు సంబంధించిన విషయం’’ అని అంటారాయన.’’
మనం మరీ హీనం
దేశంలోని ఐదేళ్లలోపు ఆడపిల్లల మరణాలను నివారించగలిగే 640 జిల్లాల్లో కేంద్రీకరించి చేసిన ఇలాంటి పరిశోధన గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా లింగ వివక్ష పాటించని దేశాల పరిస్థితులతో భారతదేశంలో కొనసాగుతోన్న ఐదేళ్లలోపు బాలికల మరణాలను పోల్చి చూశారు పరిశోధకులు. ఇందుకు గాను యునైటెడ్ నేషన్స్‌లోని 46 రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలను తీసుకొని భారతదేశ వాస్తవ పరిస్థితులను పోల్చి చూశారు. ఆయాదేశాలతో మన దేశంలోని ఐదేళ్ల లోపు బాలికల మరణాలను పోల్చి చూడగా ఎన్నో కఠోర వాస్తవాలు బయటపడ్డాయి.
పేరుకే పెద్ద రాష్ట్రాలు
మన దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో ఐదేళ్లలోపు బాలికల మరణాలు అధికంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ప్రతి రెండు జిల్లాల్లో ఒక జిల్లాలో శిశు మరణాలు అత్యధికంగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. 2000–2005 మధ్యకాలంలో 0–4 వయస్సు పిల్లల సగటు మరణాలు ప్రతి వెయ్యి మంది పిల్లల జననాలకీ 18.5 శాతంగా ఉంది. ఇది దాదాపు ప్రతి యేడాది మరణిస్తున్న పది లక్షలమందిలో పావు భాగం. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలున్న ఉత్తరాదిలో బాలికల మరణాలు ఎక్కువగా నమోదౌతున్నాయి. ఐదేళ్లలోపు బాలికల మరణాల్లో మూడింట రెండొంతుల మంది ఉత్తర భారతంలోనే మరణిస్తున్నారు. పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, మ«ధ్యప్రదేశ్ రాష్ట్రాలు చిన్నారి బాలికల మరణాల్లో అగ్రభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజల్లో తక్కువ అక్షరాస్యత, అత్యధిక జనాభా, అధిక జననాలు ఈ లింగ వివక్షకి కారణంగా ఈ పరిశోధనలో తేలింది.
సంపన్నులలోనూ వివక్ష
ఈ సమస్య కేవలం పేద, నిరక్షరాస్యులైన ప్రజల్లోనే లేదు. మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి వారిలోనూ, చదువుకున్న వారిలో సైతం ఈ జాడ్యం వ్యాపిస్తోంది. మగపిల్లలే ఇంటి బాధ్యతను నెత్తిన మోస్తారనీ, ఆస్తికి వారసులనే తప్పుడు అభిప్రాయం కూడా దీనికి మరొక కారణం. నిజానికి ఉత్తర భారత దేశంలోని సంపన్న రాష్ట్రాలుగా భావిస్తోన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆరేళ్ల వయస్సులోపు 1200 మంది బాలురకి 1000 మంది బాలికలే ఉంటున్నారు. మొత్తంగా ఈ పరిశోధనలో తేలిందేమిటంటే ప్రపంచంలోనే భారతదేశంలో సెక్స్ రేషియో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నదని.
‘నేరానికి’.. ప్రాధాన్యం
ఈ యేడాది జనవరిలో భారత ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారమే ఆడపిల్లల భ్రూణహత్యలు, వ్యాధులు, నిర్లక్ష్యం, వివక్ష కారణంగా మన దేశంలో దాదాపు 63 మిలియన్ల మంది మహిళలు అదృశ్యమైపోయారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి యేడాదీ 20 లక్షల మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారని ఈ యేడాది జనవరిలో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 2 కోట్ల 10 లక్షల మంది ‘అవాంఛిత’ బాలికలున్నట్టు భారత ప్రభుత్వం వెల్లడించింది. భారతదేశంలో నేరప్రవృత్తి పెరగడానికి మగపిల్లల ప్రాధాన్యత పెరగడం కూడా కారణమని భావిస్తున్నారు. మగపిల్లలు పుట్టే వరకూ కంటూనే ఉండడం కూడా దేశంలో ఓ దురాచారంలా మారిపోతోంది. ఇదే ఇప్పుడు ఈ దేశంలో సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధికి ఆటంకంగా తయారయ్యింది.
– అరుణ