సమాజానికి ‘మరమ్మతు’
అమ్మాయిల అక్రమ రవాణాకు చిరునామాగా నిలిచిన నేపాల్ ఇప్పుడు మరో కొత్త చిరునామా కోసం ప్రయత్నాలు చేస్తోంది. అక్రమ రవాణా నుంచి బయటపడ్డ అమ్మాయిలందరూ తిరిగి ఇళ్లకు వెళ్లలేరు. కొందరు అనాథలు. వీరందరికీ ఉపాధి మార్గం చూపెడితే వారి జీవితాన్ని వారే తిరిగి సరిచేసుకోగలరనే నమ్మకంతో ‘గివ్ 2 ఏసియా’ సంస్థవారు వాళ్లకు ద్విచక్ర వాహనాల మెకానిక్ పనిలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. గత ఏడాదిలో శిక్షణ కార్యక్రమంలో దాదాపు వెయ్యిమంది అమ్మాయిలు శిక్షణ తీసుకున్నారు.వీళ్లందరికీ మెకానిక్ షాపుల్లో ఉద్యోగాలిప్పించే పని బాధ్యత కూడా ఈ సంస్థదే. ఇప్పటికే మూడు వందల మంది అమ్మాయిలు మెకానిక్ కిట్ పట్టుకుని తమ పనిలో బిజీగా ఉన్నారు.
ఇంకొంత మంది అమ్మాయిలకు కారు డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చారు. లోకల్ ట్యాక్సీ డ్రైవర్లుగా ఉద్యోగాలు కూడా ఇప్పించారు. ‘‘దీనివల్ల టాక్సీలో ప్రయాణించే మహిళలకు రక్షణ కూడా పెరుగుతుంది. అక్రమ రవాణా కింద పోలీసుల కంట పడ్డ ప్రతి అమ్మాయికీ రక్షణ కల్పించడం వరకే ప్రభుత్వం బాధ్యత తీసుకునేది. దీనివల్ల ఆ అమ్మాయి భవిష్యత్తు ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఈ సమస్యకు ఏదో ఒక శాశ్వత పరిష్కారం వెదకాలనే ఉద్దేశ్యంతో బాగా డిమాండ్ ఉన్న ఈ మెకానిక్ వృత్తిపై దృష్టి పెట్టాం. దీనివల్ల పురుషులకు మహిళలపట్ల ఉండే అభిప్రాయాలు కూడా మారే అవకాశం ఉంటుంది’’ అని అంటారు ‘గివ్ 2 ఏసియా’ నిర్వాహకులు.