గుడి పదిలం
లౌకిక ప్రపంచంలో అలౌకిక ఆనందాన్ని పంచే ఆధ్యాత్మిక సౌధం ఆలయం. సనాతన ధర్మానికి వేదికగా.. సంస్కృతి, సాంప్రదాయాలకు వారధిగా నిలిచిన గుళ్లు కాల క్రమంలో గత వైభవాన్ని కోల్పోతున్నాయి. దేవాలయాలు, వాటి చుట్టూ పెనవేసుకుని ఉన్న జీవనాన్ని పరిరక్షించుకునే పని పెట్టుకున్నారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అండ్ సేవ్ టెంపుల్స్ డాట్ ఓఆర్జీ. అందులో భాగంగానే నగరంలో శుక్రవారం ‘సేవ్ టెంపుల్స్’ పేరుతో షార్ట్‌ఫిల్మ్స్ స్క్రీనింగ్ ప్రారంభించింది.
దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీలైన్‌తో రూపొందిన లఘుచిత్రాలు ఈ పండుగలో కనువిందు చేయనున్నాయి.ఈ స్క్రీనింగ్ ఈ నెల 24 వరకు కొనసాగుతుంది. ఇవాళ్టి నుంచి చిత్రాలు ప్రదర్శించనున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ రెండు రోజులు ఉదయం 9.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శిస్తారు. గుళ్లు, ఆలయాల్లోని శిల్పసంపద, గుడి మాన్యా లు, గోశాలలు, ఆలయాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్న వృత్తులు.. తదితరాలు ఈ లఘుచిత్రాల్లో ముఖ్యాంశాలు. ఈ షార్ట్ ఫిల్మ్స్ రూపొందించిన వాళ్లలో మహిళలు కూడా ఉన్నారు. వారిగురించి...
శంకరా...
నా పేరు మంజుల. వృత్తిరీత్యా గవర్నమెంట్ టీచర్ని. షార్ట్ ఫిల్మ్స్ తీయడం హాబీ. సాంఘిక సమస్యల మీద నాలుగు సినిమాలు తీశా. ఈ ఫెస్టివల్లో స్క్రీనింగ్ అవుతున్న నా సినిమా పేరు ‘శంకరా’. అర్చకుడిగా ఉన్న తండ్రి కష్టాలను చూసిన కొడుకు...
దీన్ని నమ్ముకొంటే బతుకు లేదని తలచి, ఉన్నత చదువుల కోసం నగరానికి వెళ్తాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి కోసం మళ్లీ ఊరికొస్తాడు. తండ్రి వారసత్వంగా అర్చక వృత్తిని స్వీకరించడానికి తపన పడతాడు. ఇది చూసిన పూజారి మనవడు.. తాత వారసత్వాన్ని తీసుకోవడానికి సిద్ధపడతాడు. అదీ కథ. ఆలయ సంస్కృతిని కాపాడుకోవాలంటే అర్చకత్వం ఉండాలి. ఈ సినిమా ద్వారా ఆ పరంపర కొనసాగాలనే సందేశం ఇచ్చాను. నేనిప్పటి వరకు తీసిన మూడు షార్ట్‌ఫిల్మ్స్‌కు అవార్డులు వచ్చాయి.
డ్యూటీస్ ఆఫ్ ప్రీస్ట్...
నా పేరు రేణుకారెడ్డి. మాది బెంగళూరు. నేను తీసిన సినిమా.. డ్యూటీస్ ఆఫ్ ప్రీస్ట్. దేవాలయాల సంరక్షణలో అర్చకులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు. పూజారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, దేవాలయాలతో ప్రజలు మమేకం కావాలన్నా.. పూజారులు ఎలా ప్రవర్తించాలి. ప్రజలతో ఎలా మమేకం కావాలన్న థీమ్‌తో ఈ సినిమా తీశాను. నేను వృత్తిరీత్యా థియేటర్ ఆర్టిస్ట్‌ని. షార్ట్మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం.