ధర్మ పరిరక్షణ కు నడుం కట్టాలి
భక్తులకు వెదురుపాక గాడ్ పిలుపు
పీఠంలో ఘనంగా నవావరణ హోమం
ముగిసిన 44వ వార్షికోత్సవాలు
వెదురుపాక (రాయవరం):
ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ తమ విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తించాలని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) భక్తులకు పిలుపునిచ్చారు. పీఠం 44వ వార్షికోత్సవాల సందర్భంగా గురువారం పీఠానికి వచ్చిన భక్తులనుద్దేశించి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్న ఆర్యోక్తి అనాదిగా వాస్తవ రూపం దాలుస్తోందన్నారు. వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాల్లో భాగంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్ కోట సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో నవావరణ హోమాన్ని నిర్వహించారు. సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన 108వ హోమాన్ని పీఠంలో నిర్వహించడం సంతోషకరమని అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు పేర్కొన్నారు. భక్తజన సంక్షోభ నివారణార్థం, వారి సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ శ్రీ విజయదుర్గా అమ్మవారి నవావరణ హోమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
వైభవంగా శ్రీవారి కళ్యాణం..
తిరుమల తిరుపతి దేవస్థానం పీఠానికి అందజేసిన శ్రీదేవి, భూదేవి సమేత విజయవెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు తిరుమంజనసేవ నిర్వహించారు. పీఠం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉత్సవ విగ్రహాలను గాడ్ సమక్షంలో శ్రీనివాసమంగాపురం దేవాలయ ప్రధాన అర్చకుడు బాలాజీ ఆధ్వర్యంలో వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి తులసి దళాలతో అర్చనలు నిర్వహించారు. రాత్రి 8 గంటల సమయంలో తిరుమల వైఖానస పండితులతో శ్రీవారి దివ్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. పూజల్లో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్ కోఆర్డినేటర్ కందర్ప హనుమాన్ తదితరులు పాల్గొన్నారు. పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.