బెంగాల్లో అవినీతి ఐఏఎస్ అరెస్టు.. ఊడిన పోలీసు కమిషనర్ ఉద్యోగం
పశ్చిమబెంగాల్లో వెంట వెంటనే రెండు సంఘటనలు జరిగాయి. మన రాష్ట్రానికి చెందిన బెంగాల్ కేడర్ ఐఏఎస్ అధికారి జి.కిరణ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో శనివారం అరెస్టయ్యారు. అయితే.. కొద్దిసేపటికే ఆయన అరెస్టు విషయంలో 'అధికారాలను అతిక్రమించి వ్యవహరించినందుకు' సిలిగురి పోలీసు కమిషనర్ జయరామన్‌ను ఉద్యోగం నుంచి ఊడగొట్టారు. సిలిగురి జల్పాయిగురి డెవలప్మెంట్ అథారిటీ (ఎస్జేడీఏ) నుంచి నిధులు పక్కదోవ పట్టించారన్న ఆరోపణలు కిరణ్ కుమార్‌పై వచ్చాయి. అయితే, ఆయనను అరెస్టు చేసేముందు మమత నేతృత్వంలోని ప్రభుత్వానికి చెప్పలేదన్న కారణంగా కమిషనర్ జయరామన్ ఉద్యోగం కాస్తా ఊడిపోయింది. 2011 సెప్టెంబర్ నుంచి 2013 మార్చి వరకు ఎస్జేడీఏ సీఈవోగా ఉన్న కిరణ్ కుమార్ దాదాపు 80 కోట్ల రూపాయలను పక్కదోవ పట్టించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, దాదాపు 200 కోట్ల రూపాయల స్కాంలోకూడా ఆయన పేరు వినవచ్చింది.
ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కూడా కిరణ్‌పై కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్టు చేసిన తర్వాత నాలుగు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు పంపింది. అయితే, ఆయనను అరెస్టు చేసే విషయంలో ముందుగా ప్రభుత్వాన్ని సంప్రదించనందుకు జయరామన్ ఉద్యోగం ఊడిపోయినా, కిరణ్ కుమార్‌పై మాత్రం కేసు కొనసాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ మిత్రా తెలిపారు. ఓ ఐఏఎస్ అధికారిని అరెస్టు చేసేముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా, జయరామన్ అలా చేయలేదని ఆయన అన్నారు.