శుభకార్యాల శ్రావణం
కడప కల్చరల్ :
శ్రావణమాసం అనగానే పండుగలు, శుభ కార్యాల మాసమని భావిస్తారు. ఆగస్టు 2న అమావాస్య అనంతరం 3వ తేది బుధవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. సెప్టెంబరు 2వ తేదీ వరకు ఈ మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో శనివారాలు ఎంతో పవిత్రమైనవని విశ్వసిస్తారు. శుక్ర వారాలు కూడా అంతే పవిత్రంగా భావించి వ్రతాలు నిర్వహిస్తారు. సోమవారాలు సైతం శివాలయాలలో పూజలు చేస్తారు. ఈ సంవత్సరం శ్రావణమాసంలో నాలుగు శనివారాలు (ఆగస్టు 6, 13, 20, 27), నాలుగు శుక్రవారాలు (ఆగస్టు 5, 12, 19, 26), నాలుగు సోమవారాలు (ఆగస్టు 7, 14, 21, 28) రానున్నాయి. దాదాపు శుక్ర, శనివారాలన్నీ వ్రతాలు, ఆలయాలలో విశేష పూజలతో సందడిగా ఉంటాయి. సోమవారాలు సైతం మహిళలు మంగళ గౌరీమాతకు విశేష వ్రతాలు జరుపుతారు. ఇందులో రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అంత్యంత భక్తిశ్రద్ధలతో సామూహికంగా నిర్వహిస్తారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజని, ఆరోజున వ్రతం చేస్తే పుణ్య ఫలాలు తప్పక లభిస్తాయని భక్తుల విశ్వాసం. మిగతా శుక్ర వారాలు కూడా వ్రతాలు నిర్వహించేందుకు మంచి రోజులుగా భావిస్తారు.
శివాలయాల్లో.....
శ్రావణమాసం వైష్ణవులకు మాత్రమే పవిత్రమైన మాసమని ఎక్కువమంది భావిస్తారు. కానీ శివాలయాలలో సైతం ఈ మాసంలోని ఐదు సోమవారాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పార్వతీమాతను మంగళగౌరీగా అలంకరించి శ్రీ మంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహిస్తారు. శ్రావణపౌర్ణమి నాడు శ్రీ గాయత్రీదేవికి వ్రతాలు నిర్వహిస్తారు. కొందరు భక్తులు మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతాన్ని జరుపుతారు. అదేరోజున నోములు నోచుకుంటారు. ఈ మాసం శివకేశవులకు అభేదాన్ని సూచిస్తుంది.
ఈ మాసంలో 9న మంగళగౌరి వ్రతం, 12న శ్రీ వరలక్ష్మివ్రతం, 18న శ్రావణపౌర్ణమి (రక్షా బంధనం), 24న శ్రీకృష్ణజన్మాష్టమి పండుగలు రానున్నాయి. ఇన్ని పండుగలు వస్తాయి గనుక ఈ మాసాన్ని పండుగల మాసంగా పేర్కొంటారు.
ముహూర్తాలు
ఏప్రిల్ తర్వాత హిందువుల వివాహాలకు సంబంధించి ముహూర్తాలు లేకపోవడంతో అడపా దడపా దేవాలయాల్లోనూ వివాహాలు నిర్వహించుకున్నారు. మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న వారికి శ్రావణమాసం మంచి అవకాశాలను ఇస్తుంది. ఈ మాసంలో వివాహాలు చేసుకోవడం శుభప్రదంగా కూడా భావిస్తారు. శ్రావణమాసం దాదాపు పూర్తిగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు మొదటి రెండు వారాలు కూడా అడపాదడపా ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత దసరా పండుగ తర్వాతే ముహూర్తాలు ఉన్నాయి. దీంతో దసరా వరకు వేచి ఉండడం మంచిది కాదన్న భావనతో పలువురు ఈ మాసంలోనే వివాహాలు నిర్వహించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.