పక్కాగా భూ వివరాల నమోదు
► ఐదు జాబితాలుగా భూములు
► 17 నాటికి జాబితాలు సిద్ధం చేయాలి
► జిల్లా జాయింట్ కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో గురువారం ప్రభుత్వ భూముల వివరాల నమోదుపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక టీములను నియమించి పరిశీలన జరిపించారు. కార్యక్రమాన్ని జేసీ పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ భూముల వివరాలను ఐదు జాబితాలుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17 నాటికి ప్రభుత్వ భూములను నాలుగు జాబితాలుగా తయారు చేసి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలకు పంపుతామన్నారు.
మొదటి లిస్టులో అసైన్డ్ భూములు, రెండవ జాబితాలో పోరంబోకు భూములు, మూడవ జాబితాలో దేవాదాయ, వక్ఫ్ భూములు, నాలుగో జాబితాలో అర్బన్ ల్యాండ్ సీలింగ్, వ్యవసాయ భూములు, సీలింగ్ భూముల వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ జాబితాలను తక్షణం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలకు పంపుతామని, ఇదే చివరి జాబితా అవుతందని వివరించారు. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిష్టర్ చే సే అవకాశం ఉండదన్నారు.
ఆర్ఎస్ఆర్లో చుక్కలున్న భూముల వివరాలను ఐదో జాబితాలో నమోదు చేయాలన్నారు. ఈ జాబితాను ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ప్రభుత్వం వీటిపై అభ్యంతరాలు స్వీకరించి వాటిని స్ట్రూటిని చేసిన తర్వాత తుదిజాబితాను తయారు చేసి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలకు పంపుతామన్నారు. ఏమైనా ప్రభుత్వ భూములను మిస్ చేసి ఉంటే వెంటనే నమోదు చేయాలన్నారు. ఈ జాబితాలు తయారైతే ప్రభుత్వభూములపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ గంగాధర్గౌడు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, ఈ-సెక్షన్ సూపరింటెండెంట్ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.