ఆ సీటు..భలే హాటు!
పట్టభద్రుల ఎంఎల్సీ స్థానానికి పోటాపోటీ
నేడు బీజేపీ అభ్యర్థిగా రాంచందర్‌రావు...
25న టీఆర్ఎస్ తరఫున దేవీప్రసాద్ నామినేషన్లు
కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి రవికుమార్ గుప్తా
సమర్ధుడైన అభ్యర్థి కోసం వామపక్షాల పరిశీలన
సిటీబ్యూరో: హైదరాబాద్ -రంగారెడ్డి -మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల శాసన మండలి స్థానం ఒక్కసారిగా హాట్‌సీట్‌గా మారిపోయింది. ఎంఎల్సీ గా ప్రొఫెసర్ నాగేశ్వర్ పదవీ కాలం పూర్తవడంతో... మార్చి 16న జరిగే ఈ ఎన్నిక కోసం టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఎన్జీఓ ముఖ్యనేత దేవీప్రసాదరావును బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో అందరి దృష్టి ఈ స్థానంపైకి మళ్లింది. దేవీప్రసాదరావు ఈనెల 25న నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఇక టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి, ప్రముఖ న్యాయవాది రాంచందర్‌రావు ఇప్పటికే విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఆయన సోమవారం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. గడిచిన ఎన్నికల్లో వామపక్షాల మద్దతుతో బరిలోకి దిగి విజయం సాధించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈసారి పోటీకి ఆసక్తి చూపించడం లేదు. ఆయన స్థానంలో సమర్ధుడైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు పది వామపక్ష పార్టీలు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించనున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా మహబూబ్‌నగర్ జిల్లా గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ ఆగిరి రవికుమార్ గుప్తా పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గ్రేటర్లో విస్తృత సంఖ్యలో బలమున్న ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.
గ్రేటర్ ఓటరే కీలకం
మూడు జిల్లాలకు కలిపి మొత్తం 2,86, 311 ఓట్లు నమోదు కాగా... అందులో సుమారు లక్షా ఎనభై వేలకు పైగా ఓట్లు గ్రేటర్ మున్సిపల్ పరిధిలోనే ఉన్నాయి. విభిన్న ప్రాంతాలు, వర్గాల కలయికతో ఉండటంతో గ్రేటర్ పట్టభద్రుల ఓట్ల పైనే అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి సారించనున్నారు. మొత్తంగా చూస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో 66,100 ఓటర్లు ఉండగా... రంగారెడ్డి జిల్లాలో 1,33,003, హైదరాబాద్ జిల్లాలో 87,208 మంది ఓటర్లు ఉన్నారు. సాధారణ ఎన్నికలకు పురుషులతో దాదాపు సమానంగా ఉన్న వ ుహిళా ఓటర్లు... పట్టభద్రులకు వచ్చేసరికి కేవలం 94,188 (32.89 శాతం) నమోదు కావటం విశేషం.
26 వరకు నామినేషన్లు
ఈ నెల 26వ తేదీ వరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. 27న నామినేషన్ల పరిశీలన, మార్చి 2 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే నెల 16న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 19న హైదరాబాద్‌లో ఓట్లు లెక్కించి... అదే రోజు ఫలితాన్ని ప్రకటిస్తారు.