హరిత బాటలో చిన్న సంస్థలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణ అనుకూల విధానాలను పాటిస్తూ, తదనుగుణమైన రేటింగ్ దక్కించుకోవడంలో చిన్న సంస్థలు (ఎస్ఎంఈలు) సైతం ముందుంటున్నాయని గ్రీన్కో సమిట్ 2016 చైర్మన్ ప్రదీప్ భార్గవ వెల్లడించారు. గ్రీన్కో రేటింగ్ పొందిన సంస్థ ఏటా రూ. 2 కోట్ల దాకా ఆదా చేయగలదని ఆయన పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సారథ్యంలో గురువారం ఇక్కడ ప్రారంభమైన గ్రీన్కో సదస్సులో ఆయన ఈ విషయాలు తెలిపారు. 2020 నాటికల్లా 1,000 సంస్థలు గ్రీన్కో రేటింగ్ పొందేలా సీఐఐ తోడ్పాటు అందించనున్నట్లు పేర్కొన్నారు.
పర్యావరణపరమైన నియంత్రణలు రావడానికి ముందుగా సర్వసన్నద్ధంగా ఉండే సంస్థలే భవిష్యత్లో మనగలవని ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని సలహా మండలి (వాతావరణ మార్పులపై) సభ్యుడు నితిన్ దేశాయ్ పేర్కొన్నారు. వాతావరణంలో పెనుమార్పులను నియంత్రించేలా దేశీ సంస్థలు పర్యావరణ అనుకూల విధానాలకు పెద్ద పీట వేస్తున్నాయని సీఐఐకి కాబోయే ప్రెసిడెంట్ శోభనా కామినేని తెలిపారు. సదస్సు సందర్భంగా ఎకో-ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ), జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ (అంధ్రప్రదేశ్)లతో సీఐఐ వేర్వేరుగా రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.