ఏసీబీ వలలో ఇద్దరు రెవెన్యూ అధికారులు
రూ. 20 వేలు తీసుకుంటూ పట్టుబడిన
తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్
గండేడ్‌లో ఘటన
గండేడ్: ఏసీబీ వలకు ఇద్దరు రెవెన్యూ అధికారులు చిక్కారు. వ్యవసాయ భూమి రికార్డుల మార్పు, పట్టా చేసేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ గండేడ్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ శీనప్పలు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. గండేడ్ మండ లం గాధిర్యాల్ గ్రామానికి చెం దిన దాయాదులు హుస్నాబాద్ హన్మంత్‌రెడ్డి, రాంరెడ్డిలకు కొంతకాలంగా సర్వేనంబర్లు 188,189, 253లోని 12 ఎకరాల భూమి విషయమై గొడవలు ఉన్నాయి. మొత్తం భూమి హన్మంత్‌రెడ్డి పేరుమీద ఉండడంతో తనకు వాటా ఇవ్వాలని రాంరెడ్డి కోర్టులో కేసు వేయడంతో 1996లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
వంశపారంపర్యంగా రాంరెడ్డికి దక్కాల్సిన రెండుభాగాలైన 8 ఎకరాలు ఇస్తానని హన్మంత్‌రెడ్డి అంగీకరించి అఫిడవిట్ రాసిచ్చాడు. దీంతో రాంరెడ్డి కుమారుడు వెంకట్రాంరెడ్డి సదరు పొలాన్ని తన తండ్రి పేరుమీదుగా మార్చి పట్టా చేయాలని 3 నెలల క్రితం తహసీల్దార్ వెంకటేశ్వర్లును ఆశ్రయించాడు. అప్పటి నుంచి తహసీల్దార్ కాలయాపన చేస్తూ వచ్చాడు. చివరకు తహసీల్దార్ రూ.40 వేలు డిమాండ్ చేయడంతో రూ. 20 వేలు ఇస్తానని వెంకట్రాంరెడ్డి అంగీకరించాడు. అయినా కూడా తహసీల్దార్ పనిచేసి పెట్టలేదు. దీంతో విసుగెత్తిన వెంకట్రాంరెడ్డి ఈనెల 10న నగరంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారిచ్చిన రూ. 20 వేలు తీసుకొని గురువారం మధ్యాహ్నం గండేడ్ తహసీల్దార్ వద్దకు వచ్చాడు. ఈరోజే రికార్డుల్లో నమోదు చేయించి పట్టా పత్రం ఇస్తానని తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆయనకు తెలిపాడు. డబ్బులు సీనియర్ అసిస్టెంట్ శీనప్పకు ఇవ్వాలని చెప్పడంతో.. ఏసీబీ అధికారుల సూచన మేరకు వెంకట్రాంరెడ్డి వాయిస్ రికార్డు చేశాడు. అనంతరం వెంకట్రాంరెడ్డి శీనప్పకు రూ. 20 వేలు ఇవ్వగా ఏసీబీ అధికారులు వెళ్లి శీనప్పను రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ శీనప్పలను అదుపులోకి తీసుకొని విచారించారు.
స్వాధీనం చేసుకున్న నోట్ల మీదున్న వేలిముద్రలను సేకరించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. కాగా తహసీల్దార్ ప్రతి కేసుకు లంచం మాట్లాడుకొని శీనప్ప ద్వారా డబ్బులు తీసుకునేవాడని స్థానికులు ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు శ్రీనివాస్, రాజేష్, కాశయ్య ఉన్నారు.