ఆమె ఫోన్‌ను ట్యాప్ చేయడం వల్లనే..
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిపిన ఉగ్రవాద దాడులకు కీలక సూత్రదారిగా భావిస్తున్న అబ్దుల్ హమీద్ అబౌద్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. పారిస్ దాడి అనంతరం హమీద్ కోసం భద్రతా బలగాలు దేశం మొత్తం జల్లెడ పట్టాయి కానీ అతని ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయాయి. అయితే ఓ మహిళ ఫోన్ నెంబర్‌ను ట్యాప్ చేయడంతో హమీద్ ఆచూకీని కనిపెట్టగలిగామని ఫ్రెంచ్ పోలీసు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
హస్నా ఐత్బులసేన్ అనే మహిళ ఫోన్ నెంబర్‌ను పోలీసులు ఓ డ్రగ్స్ కేసులో విచారణ సందర్భంగా ట్యాప్ చేశారు. అయితే ఆవిడకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో పారిస్ దాడుల నేపథ్యంలో ఈమె సంభాషణలపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ ట్యాపింగ్ మూలంగానే నిఘావర్గాలకు సెయింట్ డెనిస్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తెలిసింది. భద్రతా దళాలు ఏడు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాది అబ్దుల్ హమీద్‌ను హతమార్చారు. కాగా, మహిళా ఉగ్రవాది హస్నా ఐత్బులసేన్ ఆత్మాహుతికి పాల్పడింది.