అతిగా మద్యం తాగి ఆటోడ్రైవర్ మృతి
అనంతపురం సెంట్రల్: అతిగా మద్యం తాగి ఆటోడ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం ఉదయం గుత్తిరోడ్డులోని ఓ మద్యం దుకాణం దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పిల్లిగుండ్లకాలనీలో నివాసముంటున్న బోయరాజు (35) ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. మద్యానికి బానిసైన రాజు బుధవారం రాత్రి గుత్తిరోడ్డులో ఓ మద్యం దుకాణంలో ఫుల్లుగా తాగాడు. ఆహారం, మంచి నీళ్లు లేకుండానే ఎక్కువ మోతాదులో మద్యం సేవించడంతో చనిపోయాడని పోలీసులు వర్గాలు తెలిపాయి. రాజు మృతి చెందిన విషయాన్ని స్థానికులు పోలీసులకు చేరవేశారు. మొదట హత్యగా భావించినా పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మద్యం సేవించడం వల్లే చనిపోయాడని నిర్ధారించారు.
మద్యం షాపులు తొలగించాలని ఆందోళన
ఆటో డ్రైవర్ చనిపోవడానికి జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలే కారణమని, వెంటనే వాటిని తొలగించాలని వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. గుత్తిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మద్యం షాపులు తొలగిస్తామని ఎక్సైజ్ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బోయ గిరిజమ్మ, సీపీఐ నాయకులు లింగమయ్య, అల్లీపీరా, శ్రీరాములు, సీపీఎం నాయకులు ముస్కిన్, మహిళా సమాఖ్య నాయకులు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.