హెల్త్ వర్సిటీ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
22 కళాశాలల నుంచి హాజరైన 200 మంది విద్యార్థులు
తొలిరోజులు ఉత్సాహభరితంగా పలు పోటీలు
కాకినాడ సిటీ :
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఉభయ తెలుగు రాష్ట్రాల మెడికల్, డెంటల్ కాలేజీల విద్యార్థుల అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండురోజుల పాటు 14 ఈవెంట్లలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 22 మెడికల్, డెంటల్ కళాశాలల నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు 100, 400, 1500 మీటర్ల పరుగు, 4“100 మీటర్ల రిలే, లాంగ్ జంప్, షాట్‌పుట్ విభాగాల్లో విద్యార్థినీ విద్యార్థులకు పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తొలుత ప్రారంభోత్సవంలో రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించారు. ఇతర ప్రముఖులతో కలిసి పోటీల ప్రారంభసూచికగా బెలూన్లను ఎగురవేశారు. అనంతరం కళాశాలల వారీగా విద్యార్థులు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న మహలక్ష్మి మాట్లాడుతూ మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. పోటీల ద్వారా విద్యార్థులు క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలని కోరారు. అంతర్రాష్ట్ర హెల్త్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ పోటీలను రంగరాయ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ఫిజికల్ డైరెక్టర్లను అభినందించారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజులు, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ త్రిమూర్తులు, ‘రామ్‌కోశా’ కార్యదర్శి డాక్టర్ ఆనంద్, ఆర్ఎంసీ పీడీ స్పర్జన్‌రాజు, వివిధ కళాశాలల పీడీలు పాల్గొన్నారు.