నిలువు దోపిడీ
బద్వేలు: వేగంగా.. సులభంగా అంటూ ప్రజలకు సేవ చేయాల్సిన మీసేవా కేంద్రాలు నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. సామాన్యులు ఏదైనా సర్టిఫికేట్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అధిక రుసుం చెల్లించాల్సిందే. నియోజకవర్గ కేంద్రమైన బద్వేలులో మూడు, పోరుమామిళ్లలో ఐదు, కాశినాయన, కలసపాడులో నాలుగేసి వంతున, బి.కోడూరులో మూడు, అట్లూరులో రెండు మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏదైనా సర్టిఫికేట్ దరఖాస్తు చేసేందుకు వెళితే జేబుల్లో ఉన్నదంతా సమర్పించుకోవాల్సిందే.
ప్రతి సర్టిఫికేట్కు అదనంగా రూ.15 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రెన్యూవల్స్ కోసం కుల, ఆదాయ, ఈబీసీ, నేటీవిటి, రెసిడెన్సీ వంటి సర్టిఫికేట్లు ప్రతి విద్యార్థికి అవసరం. నియోజకవర్గంలో దాదాపు 10 వేల మందికి పైగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలో ఉన్నారు. ఓటర్‌కార్డుకు రూ.10, రెసెడెన్సీ, నేటివిటీ, కుల, ఆదాయ ధృవపత్రాలకు రూ.35 వసూలు చేయాల్సి ఉండగా రూ.50 వరకు తీసుకుంటున్నారు. ఇలా ప్రతి పత్రానికి అదనంగా రూ.15 వరకు తీసుకుంటున్నారు. దీంతో పాటు బర్త్ సర్టిఫికేట్ ప్రింట్ తీసివ్వాలన్నా అదనంగా రూ.20 సమర్పించుకోవాల్సిందే.
ఆధార్‌కు ఆగచాట్లు
నియోజకవర్గంలో దాదాపు 2 శాతం మందికి ఆధార్ కార్డులు లేవు. ప్రస్తుతం రుణమాఫీ, పీజు రీయింబర్స్మెంట్, ఇతర వివరాల కోసం తప్పనిసరి కావడంతో మీ సేవా కేంద్రాల్లో ఆధార్ తీయించుకునేందుకు పరుగులు తీస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని మీ సేవా కేంద్రం నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారు.
ఆధార్ కార్డు తీసేందుకు మండలానికి ఒక కేంద్రానికి అనుమతి ఇచ్చారు. ఉచితంగా తీయాల్సిన కార్డుకు రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. అత్యవసరమంటే రూ.200 వరకు రాబడుతున్నారు.
అదే దారిలో రిజిస్ట్రేషన్ స్టాంపులు
బద్వేలు రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయనల్లో దాదాపు 15 మంది వరకు స్టాంపు వెండర్లు ఉన్నారు. వీరంతా కూడా అమ్మాల్సిన ధరకంటే అదనంగా రూ.10 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. రూ.10 స్టాంపునకు రూ.20, రూ.100 స్టాంపునకు రూ.130, రూ. 2 రెవెన్యూ స్టాంపునకు రూ.5 వసూలు చేస్తున్నారు.
నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి ప్రతి రోజు వందమంది వరకు వివిధ రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు కోసం వస్తుంటారు. త్వరగా పని జరగాలంటే వీరందరూ స్టాంపువెండర్లు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. దీంతో పాటు రెవెన్యూ కార్యాలయం సమీపంలో వివిధ రకాల పత్రాలను కొందరు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క పత్రం కనీసం 50 పైసలు కూడా పడదు. కానీ రూ.5 వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి పని దగ్గర సామాన్యుడు దోపిడీకి గురవుతున్నాడు.
చర్యలు తీసుకుంటాం
మీ సేవా కేంద్రాలలో అధిక రుసుం వసూలు చేస్తున్నారనే విషయమై జిల్లా కో ఆర్డినేటర్ ఖలీల్ ఆహ్మద్‌ను వివరణ కోరగా కేంద్రాల్లో ఫీజు ఛార్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇలా ఏర్పాటు చేయని కేంద్రాలపై చర్యలు చేపడతామన్నారు. అధిక రుసుం విషయమై చాలామంది ఫోన్లలో ఫిర్యాదు చేస్తున్నారని, ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.