ఆన్లైన్ బీమాతో 3 ప్రయోజనాలు
ప్రతీ ఒక్కరు కలిగి ఉండాల్సిన వాటిలో జీవిత బీమా ఒకటి. ఆర్థిక ప్రణాళిక అనేది బీమాతోనే మొదలు పెట్టాలి. మీ అవసరాలను తీర్చే విధంగా విభిన్నమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న వయస్సు వారి దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు , పేదవాళ్ల దగ్గర నుంచి ధనికులకు అవసరమైన అన్నిరకాల పథకాలు ఉన్నాయి. కానీ బీమా ప్రధానోద్దేశ్యం ఇంటిలో ప్రధానంగా సంపాదించే వ్యక్తికి అనుకోని సంఘటన ఏదైనా జరిగితే అతనిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఆర్థిక భరోసా కల్పించడమే. దీన్ని టర్మ్ ఇన్సూరెన్స్ పథకాలు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి. తక్కువ ధరతో అధిక బీమా రక్షణను టర్మ్ పాలసీలు కల్పిస్తాయి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఏజెంట్లు ద్వారా కాని నేరుగా ఆన్లైన్ ద్వారా కాని కొనుగోలు చేయొచ్చు. అదే ఆన్లైన్లో కొనుగోలు చేస్తే మరికొన్ని అదనపు ప్రయోజనాలు పొందచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం...
తక్కువ ధర
టర్మ్ ఇన్సూరెన్స్ పథకాల్లో ప్రీమియం అనేది చాలా ప్రధానమైన అంశం. ఆన్లైన్లో లభించే టర్మ్ ఇన్సూరెన్స్ పథకాల ప్రీమియాలు 50 నుంచి 70 శాతం తక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఎటువంటి మధ్యవర్తి ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీ నుంచే పాలసీ తీసుకుంటుండటంతో వ్యయాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఏజెంట్ కమీషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
ఎంచుకోవడం
విభిన్న కంపెనీల పథకాలను పరిశీలించి అందులో మీ అవసరాలకు సరిపోయే పాలసీని ఎంచుకోవచ్చు. అంతేకాదు అప్లికేషన్ ఫారం మీరే పూర్తి చేస్తారు కాబట్టి కంపెనీకి ఇచ్చే సమాచారంపై కచ్చితత్వం ఉంటుంది. దీంతో క్లెయిమ్‌ల సమయంలో సమస్యలు తలెత్తవు.
సౌకర్యం
చాలా సులభంగా, మీకు నచ్చిన సమయంలో పాలసీ తీసుకోవచ్చు. దీనివల్ల విలువైన సమయం ఆదా అవుతుంది.