బాలీవుడ్ బంగారు గని
అక్షయ్ కుమార్... బాలీవుడ్ మోస్ట్ బ్యాంకబుల్ స్టార్. హిందీ బాక్సాఫీస్‌కి దొరికిన అక్షయ పాత్ర. నిర్మాతల పాలిట బంగారు గని. 3 సినిమాలు 6 యాడ్స్‌తో అక్షయ్ ఎప్పుడూ బిజీ బిజీ. ఈ బిజినెస్ వల్లే ఆయన బిజినెస్ వందల కోట్లు. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం అత్యధిక పారితోషికం అందుకుంటున్న వాళ్లలో భారతీయ సినిమా పరిశ్రమ నుంచి అక్షయ్ ఒక్కరే కావడం విశేషం. గత రెండేళ్లుగా ఆ జాబితాలో నిలిచింది అక్షయ్ ఒక్కరే. రెండొందలతో ప్రయాణం ప్రారంభించారు అక్షయ్. ప్రస్తుతం అక్షయ్ ఏడాదికి ఆర్జిస్తుంది 350 కోట్లు పైనే. ఆయన జర్నీ పై స్పెషల్ స్టోరీ.
ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది ఆ జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఒక్కరే ఉన్నారు. సుమారు 48.5 మిలియన్ల సంపాదనతో 6వ స్థానం దక్కించుకున్నారు. అంటే మన రూపాయిల్లో సుమారు 360 కోట్లు. ఈ జాబితాలో హాలీవుడ్ నటుడు డ్వెన్ జాన్సన్ 87.5 మిలియన్ల సంపాదనతో మొదటి స్థానంలో ఉన్నారు.
ఆ తర్వాత ర్యాన్ రొనాల్డ్స్ (71.5 మిలియన్లు), మార్క్ వాల్ బెర్గ్ (58 మిల్లియన్లు) బెన్ అఫ్లిక్ (55 మిలియన్లు), విన్ డీజిల్ (54 మిలియన్లు) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు. అక్షయ్ కుమార్ తర్వాత లిన్ మానుల్ మిరండా, విల్ స్మిత్, ఆడమ్ సాండ్లర్, జాకీ చాన్ మిగతా స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాను 1 జూన్ 2019 నుంచి 1 జూన్ 2020 ఆధారంగా చేశారు. అలాగే ఈ సంపాదనను ప్రీ– టాక్స్ గా నమోదు చేశారు. అంటే ఈ నటీనటులు తమ టీమ్ (ఏజెంట్స్, మేనేజర్ లు, లాయర్లు,)కి చెల్లించేది మినహాయించకుండా వీరి సంపాదన ఇంత అని అర్థం.
వెయిటర్ టు యాక్టర్
బాలీవుడ్‌కి అక్షయ్ కుమార్ ప్రయాణం అంత సులువుగా ఏం సాగలేదు. సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టకముందు రకరకాల ఉద్యోగాలు చేశారు. వివిధ దేశాలు తిరిగారు. రాజీవ్ హరి ఓం భాటియాగా అక్షయ్ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అక్షయ్ కుమార్ గా మారారు. చిన్నప్పటి నుంచి చదువు పై పెద్ద శ్రద్ధ లేదని చాలా సందర్భాల్లో ఆయనే చెప్పారు. 12 పూర్తవ్వగానే చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు అక్షయ్. ఆ సమయంలో బ్యాంకాక్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అక్కడే కొన్ని రోజులు వెయిటర్‌గానూ పని చేశారు.
బ్యాక్ టు ముంబై
బ్యాంకాక్ లో నాలుగైదేళ్లు ఉన్న తర్వాత ముంబైకి తిరిగి వచ్చేశారు అక్షయ్. మళ్లీ ముంబైలో చిన్నా చితక ఉద్యోగాలు చేశారు. జేబులో 200 రూపాయిలతో ముంబైలో గడిపిన రోజులున్నాయి అని చాలా సందర్భాల్లో అక్షయ్ తెలిపారు. తర్వాత కొన్ని రోజులు బంగ్లాదేశ్ లోనూ ఉన్నారు.
మార్షల్ ఆర్ట్స్ టీచర్ టు మోడల్
తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ద్వారానే కొన్ని రోజులు ఉపాధి పొందారు. అలా కొన్ని రోజులు పాటు పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉన్నారు. అనుకోకుండా అక్షయ్ స్టూడెంట్స్‌లో ఒకరి తండ్రి అక్షయ్‌కు మోడల్‌గా అవకాశం చూపించారు. జయేష్ సేథ్ అనే ఫోటోగ్రాఫర్ దగ్గర సుమారు 18 నెలలు అసిస్టెంట్ గా పని చేశారు. అలా ఆయన జయేష్ దగ్గరే ఫ్రీగా పోర్ట్ ఫోలియో షూట్ చేయించుకోగలిగారు. మోడల్‌గా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేశారు అక్షయ్. మార్షల్ ఆర్ట్స్ ద్వారా సంపాదించే దాన్ని మోడలింగ్ లో రెండు మూడు రోజుల్లో సంపాదించారు. చూడటానికి బావుండటం, చురుకుతనం వల్ల మోడల్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా త్వరగా ప్రమోషన్ వచ్చింది అక్షయ్‌కు.
ఫ్లైట్ మిస్ – కెరీర్ టేక్ ఆఫ్
ఓసారి మోడలింగ్ పని మీద బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది అక్షయ్. అనుకోకుండా ఫ్లైట్ మిస్ అయ్యారు. ఎక్కడ లేని నిరుత్సాహం అంతా అక్షయ్‌ని ఆవహించింది. కానీ కుంగిపోకుండా ఆ మధ్యాహ్నం నుంచి మళ్లీ తన పని ప్రారంభించారు. స్టూడియోల చుట్టూ ఆల్బమ్ పట్టుకు తిరగడం ప్రారంభించారు. ఆ సాయంత్రమే ప్రమోద్ చక్రవర్తి ‘దీదార్’ అనే సినిమాకు అక్షయ్‌ను హీరోగా సెలెక్ట్ చేశారు. కానీ అక్షయ్ చేసిన ‘సౌగంది’ అనే చిత్రం (1991)లో ముందు విడుదలయింది. కానీ బాలీవుడ్ లోకి ఒక కొత్త హీరో వచ్చాడు అని తెలిసేలా చేసింది మాత్రం ‘కిలాడీ’. నటుడిగా అక్షయ్ మొదటి బ్రేక్ అదే. అలా వరుస సినిమాలు చేస్తూ వెళ్లిపోయారు. 1994లో అక్షయ్ కుమార్ సుమారు 14 సినిమాల్లో కనిపించారు.
లవ్‌స్టోరీ
అక్షయ్ కుమార్ తన కో స్టార్, బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓసారి ఫిలింఫేర్ మ్యాగజీన్ షూటింగ్ కోసం కలసిన వీళ్ల మనసులు కలిశాయి. కొన్నిరోజులు డేటింగ్ చేశారు. 2001లో అక్షయ్ కుమార్, ట్వింకిల్ పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు. ఆరవ్, నితారా.
యాక్షన్ – కామెడీ
కెరీర్ ప్రారంభంలో వరుసగా యాక్షన్ సినిమాల్లో కనిపించారు అక్షయ్. సినిమాల్లో రిస్కీ స్టంట్ లు చేస్తూ ‘ఇండియన్ జాకీ చాన్’ అనిపించుకున్నారు కిలాడీ కుమార్. ఆ తర్వాత కామెడీ రోల్స్‌కి జానర్ ను షిఫ్ట్ చేశారు అక్షయ్. అయితే కెరీర్ అనుకున్నట్టే సాగదు కదా. ఓసారి వరుసగా 14 ఫ్లాప్‌లు చూశారు అక్షయ్. డిప్రెషన్లోకి వెళ్లిపోయారట. కానీ తాను నేర్చుకున్న, నమ్మిన మార్షల్ ఆర్ట్స్ అందులో నుంచి బయట పడేలా చేసిందని చెప్పారు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యం అంటారు అక్షయ్. అందుకే స్త్రీలకోసం ప్రత్యేకంగా ఓ అకాడమీని స్థాపించారు. నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఇందులో ఉచితంగా ప్రొఫెషనల్ ట్రైనర్ల సహాయంతో శిక్షణ పొందవచ్చు.
కామెడీ – మెసేజ్
ఆ మధ్య వరుస ఫన్ ఫిల్మ్స్‌లో కనిపించారు అక్షయ్. ఆ తర్వాత వరుసగా సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనూ (‘టాయిలెట్ – ఏక్ ప్రేమ్ కథా’, ‘ప్యాడ్ మాన్’) కనిపించారు అక్షయ్. 2010 నుంచి 2019 వరకు ఏడాదికి 3 సినిమాలు తక్కువ కాకుండా చేస్తున్నారు అక్షయ్. ప్రస్తుతం ఇండియాలోనే ఏ స్టార్ హీరో చేయని ఫీట్ ఇది అని చెప్పుకోవచ్చు.
మిస్టర్ డిపెండబుల్
ప్రస్తుతం ఇండియన్ సినిమా నంబర్ గేమ్స్ చుట్టూ తిరుగుతోంది. వంద కోట్ల క్లబ్.. రెండొందల కోట్ల క్లబ్.. మూడొందల కోట్ల క్లబ్ అని విజృంభిస్తున్నారు. ఒక స్టార్ సినిమాలు ఎంత బిజినెస్ చేస్తున్నాయి అని లెక్కకడితే అక్షయ్ సినిమాల బిజినెస్ ఇలా ఉంది. ∙2016లో 365 కోట్లు (3 సినిమాలు) ∙2017లో 287 కోట్లు (2 సినిమాలు) ∙2018లో 376 కోట్లు (3 సినిమాలు) ∙2109లో 720 కోట్లు (4 సినిమాలు)
ప్రస్తుతం అక్షయ్ చేతిలో ఉన్న సినిమాలు ఆరు
► సూర్యవన్షీ – షూటింగ్ పూర్తి. థియేటర్స్ ఓపెన్ చేస్తే విడుదలయ్యే మొదటి సినిమా ఇది
► లక్ష్మీ బాంబ్ – త్వరలో డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది
► పృథ్వీ రాజ్ – చిత్రీకరణ సగం పూర్తయింది
► అత్రాంగి రే – షూటింగ్ కొన్ని రోజులు జరిగింది
► బచ్చన్ పాండే – మే లో చిత్రీకరణ ప్రారంభం కావాల్సింది
► బెల్ బాటమ్ – ఇటీవలే చిత్రబృందం షూటింగ్ కోసం స్కాట్‌ల్యాండ్ వెళ్లారు.
పెద్ద మనసు
అక్షయ్ జేబు మాత్రమే కాదు. మనసు కూడా చాలా పెద్దది. కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డవారిని ఆదుకోవడానికి అక్షయ్ 25 కోట్లను విరాళంగా ప్రకటించారు.
భార్య ట్వింకిల్, కుమారుడు ఆరవ్, కుమార్తె నితారాతో...