Hindu Janajagruti Samiti
-
ఆ ముగ్గురి హత్యల వెనుక ఒకే సంస్థ
ముంబై: హేతువాదులు నరేంద్ర దబోల్కర్, ఎంఎం కలబురిగి, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యలకు ఒకే అతివాద సంస్థ కారణమని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, హేతువాది, కమ్యూనిస్టు నేత గోవింద్ పన్సారే హత్యతో ఈ సంస్థకు లింకులున్నట్లు ఆధారాలు లభించలేదన్నారు. ‘దబోల్కర్, లంకేశ్, కలబురిగిల హత్యల్లో ఒకే రకమైన భావాలున్న వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించాం. ఆ సంస్థలోని దాదాపు అందరు సభ్యులకూ సనాతన్ సంస్థతోనూ దాని అనుబంధ ‘హిందూ జనజాగృతి సమితి’తోనూ సంబంధాలున్నాయని తేలింది. పాల్ఘర్ జిల్లా నల్లసోపారలో ఇటీవల ఆయుధాలు, పేలుడు సామగ్రితోపాటు అరెస్టయిన వారికి దబోల్కర్, లంకేశ్, కలబురిగిల హత్యలతో ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైంది. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే దబోల్కర్ హత్యతో సంబంధమున్న ఇద్దరిని అరెస్టు చేశాం. దీంతోపాటు ఈ ముగ్గురి హత్యలకు కీలక సూత్రధారి వీరేంద్ర సింగ్ తవాడేను కూడా పట్టుకున్నాం’ అని తెలిపారు. -
'బాజీరావ్ మస్తానీ' విడుదలను అడ్డుకోండి
హైదరాబాద్: 'బాజీరావ్ మస్తానీ' సినిమా విడుదల కాకుండా చూడాలని హిందూ జాగృతి సమితి(హెచ్ జేఎస్) డిమాండ్ చేసింది. చరిత్రను వక్రీకరించి ఈ సినిమా రూపొందించారని ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర సెన్సార్ బోర్డు, కేంద్ర సాంస్కృతిక శాఖకు ఆదివారం ఫిర్యాదు చేసింది. 'బాజీరావ్ మస్తానీ' భార్యలు డాన్స్ చేసినట్టు 'పింగా పింగా' పాటలో చూపించారని, ఇది అబద్ధమని హెచ్ జేఎస్ తెలిపింది. ఆ కాలంలో గౌరప్రదమైన పీష్వా కుటుంబాలకు చెందిన స్త్రీలు సినిమాలో చూపించినట్టుగా డాన్సులు చేయలేదని హెచ్ జేఎస్ తెలంగాణ సమన్వయకర్త చంద్ర మొగర్ ఒక ప్రకటనలో తెలిపారు. చరిత్రను వక్రీకరించడం తగదని పేర్కొన్నారు. పీష్వా కుటుంబ వ్యవస్థను అగౌరపరిచేలా ఉన్న పింగా, పింగా పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. 'బాజీరావ్ మస్తానీ' సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.