ఎట్టకేలకు కదిలారు !
అడ్డాకుల, న్యూస్‌లైన్: ఎట్టకేలకు మండలంలోని పెద్దవాగులో సాగుతు న్న ఇసుక అక్రమ డంపింగ్‌ల దందాకు అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ అధికారులు నడుం బిగించారు. ఇసుకమాఫియా అక్రమంగా వేసుకున్న దారులను మూసివేయించే పనిలో ప డ్డారు. ఈ వాగులో జరుగుతున్న అ క్రమ ఇసుక రవాణాపై ఈనెల 21న ‘కుప్పేసి కుమ్మేస్తున్నారు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన తరువాత అధికారుల్లో కదలిక వచ్చింది. అదేరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ శర్మన్ మండల రెవెన్యూ అధికారిపై సీరియస్ అయ్యారు.
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. అదేవిధంగా పెద్దవాగు పరిసరాల్లో సీజ్ చేసిన ఐదువేల క్యూబిక్‌మీటర్ల ఇసుకను చంచల్‌గూడ జైలు వద్ద జరిగే నిర్మాణాలకు అనుమతివ్వాలని తహశీల్దార్ కార్యాలయానికి అంతకు ముందే వచ్చిన ఉత్తర్వులను కూడా రద్దు చేశారు. మళ్లీ తాజాగా మహబూబ్‌నగర్ ఆర్డీఓ హన్మంతురావు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు బుధవారం ఉదయం పెద్దవాగులో అక్రమార్కులు వేసిన దారులను యంత్రాల సహాయంతో మూసివేయించారు. పొన్నకల్ శివారులో ఉన్న డంపింగ్‌ల వద్ద ఎస్సై టి.శివకుమార్‌తో కలిసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్ర శ్రీనివాస్ జేసీబీతో మూడుచోట్ల దారులపై కాల్వలను తీయించారు.
డంపింగ్‌ల వద్ద వేసుకున్న గుడిసెలను రెవెన్యూ కార్యదర్శులు రామకృష్ణగౌడ్, కొండప్పలు గ్రామసేవకులతో తొలగించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కొమిరెడ్డిపల్లి, దుబ్బపల్లి, పొన్నకల్ గ్రామాల పరిసరాల్లో వాగులోకి చిన్న డీసీఎంలు, టిప్పర్లు వెళ్లకుండా దారులపై కాల్వలు తీయించారు. వనపర్తి డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి కొమిరెడ్డిపల్లి వద్ద కాల్వలు తీస్తుండగా వచ్చి పరిశీలించి వెళ్లారు. ప్రస్తుతం ఎక్కడ కూడా వాహనాలు వాగులోకి వెళ్లకుండా దారులను మూసేశారు. అక్రమ ఇసుక రవాణాపై అధికారులు ఇలాగే కఠినంగా వ్యవహరిస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.