సిద్దిపేటలోకి వెళ్లేది లేదు
హుస్నాబాద్‌లో ఆందోళన తీవ్రతరం
నల్లజెండాలతో విద్యార్థుల భారీ ప్రదర్శన
టైర్లకు నిప్పు.. పోలీసుల లాఠీచార్జి
ఎంపీ, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల దహనానికి యత్నం
హుస్నాబాద్: హుస్నాబాద్, కోహెడను సిద్దిపేటలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం హుస్నాబాద్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి మల్లెచెట్టు చౌరస్తా వరకు నల్ల జెండాలతో విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అఖిలపక్ష, విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్యే సతీష్‌కుమార్, ఎంపీ వినోద్‌కుమార్ దిష్టి బొమ్మలను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫ్లెక్సీలు, సిద్దిపేట జిల్లా మ్యాప్‌ను దహనం చేశారు. అనంతరం టైర్లకు నిప్పు పెట్టేందుకు యత్నించారు. సిద్దిపేట బస్సు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు డిస్ట్రిక్ట్ గార్డ్స్ అత్యూత్సాహం ప్రదర్శించి ఆందోళన కారులపై లాఠీ ఝలిపించారు. ఆగ్రహించిన పలువురు ‘పోలీసు జులుం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. స్పందించిన సీఐ ప్రశాంత్‌రెడ్డి, ఎసై ్స ఎర్రల కిరణ్ డిస్ట్రిక్ గార్డ్స్ నుంచి లాఠీలు లాకున్నారు. పోలీసుల లాఠీచార్జీలో మాజీ ఎంపీపీ, విద్యార్థి సంఘాల నాయకులు స్వల్పంగా గాయపడ్డారు.