ICC T-20 World Cup
-
రషీద్ ఖాన్‌కు బంపర్ ఆఫర్; టీ20 ప్రపంచకప్ టార్గెట్‌గా
కాబుల్: అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. రానున్న టీ20 ప్రపంచకప్ టార్గెట్‌గా రషీద్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబరు 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. రషీద్ ఖాన్ చేతికి టీ20 టీమ్ పగ్గాలిచ్చినట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఇక టీ 20 వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్థాన్ గ్రూప్-బిలో ఉండగా.. ఆ గ్రూప్‌లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి అగ్రజట్లు ఉన్నాయి. వాస్తవానికి 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత రషీద్ ఖాన్ని మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా నియమించింది. అతని కెప్టెన్సీలో 16 వన్డేలాడిన అఫ్గానిస్థాన్ ఆరింట్లో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల రిత్యా రషీద్ ఖాన్ని కెప్టెన్సీ నుంచి తప్పించిన బోర్డు అస్గర్ అఫ్గాన్‌ని కెప్టెన్‌గా నియమించింది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో మళ్లీ రషీద్‌కు పగ్గాలు అప్పజెప్పాలని భావించింది. అయితే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించిన రషీద్ ఎట్టకేలకి బోర్డు పెద్దల జోక్యంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్‌గా హస్మతుల్లా షాహిది సెలెక్ట్ అయ్యాడు. ఇక ఇటీవలే ప్రైవేట్ టీ20 ఆడడానికి లండన్ చేరుకున్న రషీద్ ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్- 2లో కొనసాగుతున్నాడు. -
ఆసీస్ ఆరోసారి...
సిడ్నీ: ప్రపంచకప్‌లలో దురదృష్టాన్ని పక్కన పెట్టుకొని పరుగెత్తే దక్షిణాఫ్రికాకు మరోసారి అలాంటి అనుభవమే ఎదురైంది. టి20 మహిళల ప్రపంచకప్ లీగ్ దశలో అజేయంగా నిలిచిన ఆ జట్టు... సెమీస్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు సన్నద్ధమైన తరుణంలో వర్షం వెంటాడింది. ఫలితంగా ఓవర్లు తగ్గి ఒక్కసారిగా లక్ష్యం మారిపోయింది. ఒత్తిడికి లోనైన సఫారీ టీమ్ చివరకు ఓటమిని ఆహ్వానించింది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) ఓడి నిష్క్రమించింది. ఆసీస్ వరుసగా ఆరోసారి ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇప్పటివరకు వన్డే, టి20 ప్రపంచకప్‌లు అన్నీ కలిపి దక్షిణాఫ్రికా పురుషులు, మహిళలు జట్లు ఒక్కసారి కూడా సెమీఫైనల్ దశను దాటలేకపోయాయి. సిడ్నీలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి సెమీస్ రద్దయిన తర్వాత వర్షం తెరిపినివ్వడంతో నిర్ణీత సమయానికి రెండో సెమీస్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మెగ్ లానింగ్ (49 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. అనంతరం విరామం సమయంలో మళ్లీ వాన రావడంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98 పరుగులుగా నిర్దేశించారు. ఐదు ఓవర్లలోపే ఆ జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. లారా వోల్వార్ట్ (27 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి వరకు పోరాడినా లాభం లేకపోయింది. -
కివీస్‌ను గెలిపించిన డివైన్
పెర్త్: కెప్టెన్ సోఫీ డివైన్ (55 బంతుల్లో 75 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో కివీస్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ముందుగా లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి అటపట్టు (41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, జెన్సెన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు సాధించింది. కెప్టెన్‌కు తోడుగా మ్యాడీ గ్రీన్ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. డివైన్ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ టి20ల్లో డివైన్ వరుసగా ఆరో మ్యాచ్‌లో కనీసం అర్ధసెంచరీ సాధించడం విశేషం. విండీస్ చేతిలో థాయ్‌లాండ్ ఓటమి... తొలిసారి ప్రపంచకప్ బరిలోకి దిగిన థాయ్‌లాండ్‌కు మొదటి మ్యాచ్‌లో చుక్కెదురైంది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (3/13, 37 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శతో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ముందుగా థాయ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 78 పరుగులే చేయగలిగింది. అనంతరం విండీస్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 80 పరుగులు చేసింది. -
అదిరే ఆరంభంతో...
పూనమ్ యాదవ్ లెగ్ స్పిన్ ఉచ్చు కంగారూ మెడకు బలంగా బిగుసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సొంతగడ్డపై చేష్టలుడిగి తలవంచితే... భారత్ ఘనవిజయంతో టి20 ప్రపంచకప్‌కు తెరలేపింది. పేస్‌తో శిఖా పాండే, గూగ్లీలతో పూనమ్ మన మహిళల జట్టుకు అద్భుత గెలుపు అందించారు. పూనమ్ యాదవ్ సిడ్నీ: ఆసీస్ మహిళల జట్టు భారత్ కంటే ఎంతో మెరుగైంది. మరెంతో పటిష్టమైంది. ప్రత్యేకించి పొట్టి ప్రపంచకప్‌లో ఎదురే లేని జట్టు ఆస్ట్రేలియా. ఇప్పటికే నాలుగుసార్లు చాంపియన్. ఇప్పుడు జరిగేది వారి సొంతగడ్డపైనే! దీంతో ప్రత్యర్థులకు డిఫెండింగ్ చాంపియన్ అంటే ఒకింత ‘కంగారూ’. అలాంటి జట్టునే భారత మహిళలు కంగు తినిపించారు. 11 మంది బ్యాటింగ్‌కు దిగితే తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్‌ను 6 పరుగులలోపే అవుట్ చేశారు. ఇదంతా జరిగింది సిడ్నీలో అయితే... మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ అదిరే ఆరంభానికి ఆసీస్ చెదిరిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్ పూనమ్ యాదవ్ (4/19) బౌలింగ్ వారిపట్ల సింహ స్వప్నమైంది. అందుకేనేమో క్రీజులో నిలబడే సాహసం, పరుగులు చేసే ప్రయత్నం వదిలి తలవంచేశారంతా! శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ (46 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు) రాణించింది. జెస్ జొనసెన్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 115 పరు గుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ హీలీ (35 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. పూనమ్ యాదవ్ వైవిధ్యమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించింది. శిఖా (3/14) నిప్పులు చెరిగింది. రాణించిన దీప్తి షఫాలీ (15 బంతుల్లో 29; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో భారత్ ఇన్నింగ్స్ ధాటిగా మొదలైంది. ఓవర్‌కు 10 పరుగుల చొప్పున 4 ఓవర్లలో 41 పరుగులు చేశాక స్మృతి (10), షఫాలీ, హర్మన్‌ప్రీత్ (2) స్వల్పవ్యవధిలో అవుటయ్యారు. దీంతో ఏడో ఓవర్ ముగియకముందే భారత్ స్కోరు 47/3. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 26) షాట్ల జోలికి వెళ్లకుండా దీప్తి శర్మతో కలిసి పరుగుల పోరాటం చేసింది. దీంతో మరో వికెట్ పడకుండా భారత్ 15.5వ ఓవర్లలో వందకు చేరుకుంది. అయితే మరుసటి బంతికే జెమీ మా... కిమిన్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. ఈ దశలో దీప్తికి వేద (9 నాటౌట్) జతయ్యింది. హీలీ శ్రమ వృథా ఫామ్, ర్యాంకింగ్, సొంతగడ్డపై మ్యాచ్ ఇలా ఏ రకంగా చూసిన భారత్ నిర్దేశించిన లక్ష్యం ఆసీస్‌కు కష్టమైందేమీ కాదు. అలాగే 5.3 ఓవర్లదాకా ఆస్ట్రేలియా స్కోరు 32/0. ఇక గెలిచేందుకు 101 చేస్తే సరిపోతుంది. కానీ మూనీ (6)ని శిఖా పాండే అవుట్ చేశాకా ఆట ఒక్కసారిగా మారిపోయింది. ఓపెనర్ హీలీ పోరాటం చేస్తున్నా... గార్డ్నర్ (34) అండగా నిలిచినా... లక్ష్యానికి దూరంగానే నిలిచిపోయింది. వాళ్లిద్దరిని పెవిలియన్‌కు చేర్చిన పూనమ్ యాదవ్ తన స్పిన్ ఉచ్చును బిగించడంతో ఆసీస్ చెదిరిపోయింది. పూనమ్‌కు తోడు శిఖా పాండే నిప్పులు చెరుగుతుంటే ఆసీస్ ఇన్నింగ్స్ కూలిపోయింది. లానింగ్ (5), హేన్స్ (6), పెర్రీ (0), జొనసెన్ (2), అన్నబెల్ (2), కిమిన్స్ (4), స్ట్రానో (2), షట్ (1 నాటౌట్) ఇలా ఏ ఒక్కరు నిలువలేకపోయారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) అన్నబెల్ (బి) పెర్రీ 29; మంధాన ఎల్బీడబ్ల్యూ (బి) జెస్ జొనసెన్ 10; జెమీమా ఎల్బీడబ్ల్యూ (బి) కిమిన్స్ 26; హర్మన్‌ప్రీత్ (స్టంప్డ్) హీలీ (బి) జెస్ జొనసెన్ 2; దీప్తి శర్మ నాటౌట్ 49; వేద కృష్ణమూర్తి నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు)132. వికెట్ల పతనం: 1–41, 2–43, 3–47, 4–100 బౌలింగ్: స్ట్రానో 2–0–15–0, పెర్రీ 3–0–15–1, షట్ 4–0–35–0, జెస్ జొనసెన్ 4–0–24–2, కిమిన్స్ 4–0–24–1, గార్డ్నర్ 3–0–19–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) అండ్ (బి) పూనమ్ 51; మూనీ (సి) గైక్వాడ్ (బి) శిఖా 6; లానింగ్ (సి)భాటియా (బి) గైక్వాడ్ 5; హేన్స్ (స్టంప్డ్) భాటియా (బి) పూనమ్ 6; గార్డ్నర్ (సి) అండ్ (బి) శిఖా 34; పెర్రీ (బి) పూనమ్ 0; జెస్ (సి) భాటియా (బి) పూనమ్ 2; అన్నబెల్ (స్టంప్డ్) భాటియా (బి) శిఖా 2; కిమిన్స్ రనౌట్ 4; స్ట్రానో రనౌట్ 2; షట్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 115. వికెట్ల పతనం: 1–32, 2–55,3–67, 4–76, 5–76, 6–82, 7–101, 8–108, 9–113, 10–115. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–17–0, రాజేశ్వరీ గైక్వాడ్ 4–0–31–1, శిఖా పాండే 3.5–0–14–3, అరుంధతి 4–0–33–0, పూనమ్ 4–0–19–4. -
వచ్చే ఏడాది దులీప్ ట్రోఫీకి విరామం!
ముంబై : గత ఐదు దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్న దులీప్ ట్రోఫీ ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్ వచ్చే ఏడాది వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశవాళీ టోర్నీ జరిగే సమయానికే భారత్‌లో ఐసీసీ టి20 ప్రపంచకప్ కూడా జరుగనుంది. మంగళవారం అనిల్ కుంబ్లే నేతృత్వంలో సమావేశమైన ఐసీసీ సాంకేతిక కమిటీ దులీప్ ట్రోఫీ వాయిదాను ప్రతిపాదించింది. దీన్ని బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. 2016 మార్చి-ఏప్రిల్‌లో టి20 ప్రపంచకప్ జరుగనుంది.