మలద్వారంలో 349 బంగారు బిస్కెట్లు
చెన్నై: శ్రీలంక నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సినీపక్కీలో పట్టుకున్నారు. విమానాశ్రయాల్లో నిఘా పెరగడంతో స్మగ్లర్లు సముద్రమార్గాన్ని ఎంచుకున్నారు. నాగపట్నం జిల్లా నాగూరు నుంచి కారులలో భారీ ఎత్తున బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచి నిఘాపెట్టారు. తెల్లవారుజామున వాంజూరు చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక కారు నిలపకుండా వెళ్లిపోయింది.
అధికారులు వెంటనే ఆ వాహనాన్ని వెంబడించారు. ఎట్టకేలకు కారైక్కాల్ సమీపం పట్టిన్నం అనే ప్రాంతంలో కారును పట్టుకోగలిగారు. కారు సీటు కింద ఉన్న పార్శిల్‌ను విప్పిచూడగా అందులో 14 కిలోల బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. కారులో ఉన్న నాగూర్‌కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
ఇదిలావుండగా మరో బంగారు అక్రమరవాణా కేసులో శ్రీలంక నుంచి తిరుచ్చీకి గురువారం సాయంత్రం శ్రీలంకన్ విమానం వచ్చింది. ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి నడకతీరుపై అధికారులకు అనుమానం కలిగింది. అతన్ని ప్రత్యేక గదికి తీసుకెళ్లి తనిఖీ చేయగా, మలద్వారం వద్ద దాచిపెట్టి ఉన్న రూ.10 లక్షల విలువైన 349 బంగారు బిస్కెట్లు లభ్యమైనాయి. చెన్నై సాలిగ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (59) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.