ఫేస్ బుక్ ఇండియాకు కొత్త ఎండీ
సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ కు భారత కార్యకలాపాలకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేశారు. మాజీ అడోబ్ ఎగ్జిక్యూటివ్ ఉమంగ్ బేడీని కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా ఫేస్ బుక్ నియమించుకుంది. జూలై నుంచి బేడీ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్ లోని టాప్ క్లైయింట్స్ తో, స్థానిక ఏజెన్సీలతో వ్యూహాత్మక సంబంధాలు పెంచుకోవడంలో ఆయన తోడ్పడనున్నారని ఫేస్ బుక్ వెల్లడించింది. ఇప్పటివరకూ భారత ఫేస్ బుక్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న కార్తీక రెడ్డి నుంచి త్వరలోనే బేడీ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఉమంగ్ బేడీకి బాధ్యతలు అప్పగించిన వెంటనే కార్తీక రెడ్డి అమెరికాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయం మెల్నో పార్క్ లో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. అడోబ్ దక్షిణా ఆసియా ప్రాంతానికి బేడీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన బేడీ, అక్కడ పదవికి రాజీనామా చేసి.. ఫేస్ బుక్ లో చేరిపోయారు.
టాలెంట్ సముదాయానికి గుర్తింపుగా భారత్ వర్థిల్లుతుందని, ఉమెంగ్ బేడిని భారత మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించుకోవడంలో తాము సంతోషిస్తున్నామని ఫేస్ బుక్ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ డాన్ నియరి తెలిపారు. ఇండియాలో ఫేస్ బుక్ వ్యాపారాలను లీడ్ చేస్తూ బెస్ట్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గా ఉమంగ్ నిలుస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అమెరికా తర్వాత ఫేస్ బుక్ కు అతిపెద్ద మార్కెట్ భారత్ లోనే ఉంది. భారత్ లో 150 మిలియన్ ఫేస్ బుక్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.