బజరంగ్ ‘కంచు’ పట్టు
బుడాపెస్ట్ (హంగేరి): భారత రెజ్లింగ్ చరిత్రలో మంగళవారం కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. తొలిసారి భారత్‌కు ఒకే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు వచ్చాయి. సోమవారం పురుషుల ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో అమిత్ కుమార్ రజత పతకం సాధించగా... మంగళవారం బజరంగ్ అద్భుత ఫలితాన్ని నమోదు చేశాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు.
నిజానికి బజరంగ్ తొలి రౌండ్లోనే వ్లాదిమిర్ దుబోవ్ (బల్గేరియా) చేతిలో ఓడిపోయాడు. అయితే దుబోవ్ ఫైనల్‌కు చేరుకోవడంతో అతని చేతిలో ఓడిపోయిన బజరంగ్తోపాటు మరో ముగ్గురు రెజ్లర్లకు ‘రెప్‌చేజ్’ కాంస్య పతక పోరులో అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బజరంగ్ ‘రెప్‌చేజ్’ లోని మూడు బౌట్స్లలోనూ విజయం సాధించి నమ్మశక్యంకానిరీతిలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
‘రెప్‌చేజ్’ తొలి బౌట్లో బజరంగ్ 5-0తో షోగో మెదా (జపాన్)పై; రెండో బౌట్లో 10-3తో ఇవాన్ గుదెవా (రుమేనియా)పై; కాంస్య పతక పోరులో 9-2తో న్యామ్ ఒచిర్ ఎన్సైఖాన్ (మంగోలియా)పై విజయం సాధించాడు. ఇతర విభాగాల్లో భారత్‌కే చెందిన పవన్ (84 కేజీలు), హితేందర్ (120 కేజీలు) మాత్రం తొలి రౌండ్లోనే ఓడిపోయారు.