ఇండియాబుల్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు
బినామీ లావాదేవీలు, పన్ను ఎగవేతపై సందేహాలు
న్యూఢిల్లీ: భారీగా పన్ను ఎగవేసినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండియాబుల్స్ గ్రూపునకు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు బుధవారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. వందల సంఖ్యలో ఐటీ అధికారులు, స్థానిక పోలీసులతో కలసి బృందాలుగా ఏర్పడి ముంబై, ఢిల్లీ, చెన్నైలోని ఇండియాబుల్స్ గ్రూపునకు చెందిన పలు కంపెనీల ప్రాంగణాల్లో ఏక కాలంలో సోదాలు చేపట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సోదాలు ఎక్కువ భాగం ముంబై కార్యాలయంలోనే జరిగాయి. ఇండియాబుల్స్ సంస్థ తీసుకున్న రూ. 1,700 కోట్ల కార్పొరేట్ రుణం కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగాయని, అయితే రూ.1,500 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్టు సందేహాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి అలాగే, గతంలో ఇండియాబుల్స్ నిర్వహించిన ఆస్తుల అమ్మకాల్లో రూ.1,000 కోట్ల విలువ మేర బినామీ లావాదేవీలు సైతం జరిగాయన్న సందేహాలు ఉన్నట్టు ఆ అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఐటీ దాడులను ఇండియాబుల్స్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా ధ్రువీకరించింది. గతేడాది రూ.782కోట్ల మేర ఆదాయపన్ను, రూ.372కోట్ల మేర సేవాపన్ను చెల్లించినట్టు తెలిపింది.
షేర్లు కుదేలు: ఐటీ దాడుల వార్తలతో ఇండియాబుల్స్ వెంచర్స్ 6.86% నష్టంతో 31.90 వద్ద ముగి సింది. ఇండియాబుల్స్ హోల్సేల్ సర్వీసెస్ కూడా 4.89% నష్టంతో రూ.28.20వద్ద క్లోజ్ కాగా... ఇండియాబుల్స్ రియల్ఎస్టేట్ 4.23% నష్టంతో రూ. 91.65 వద్ద, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.89 శాతం నష్టంతో రూ.714.40కు దిగివచ్చాయి.