కెరీర్ కౌన్సెలింగ్
ప్యాకేజింగ్ కోర్సులను పూర్తిచేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి?
- సంతోష్‌కుమార్, వరంగల్
వస్తువుల విక్రయాల్లో ప్యాకేజింగ్‌దే కీలక పాత్ర. ప్యాకేజీ ఆకర్షణీయంగా ఉంటే వస్తువు వినియోగదారుడి దృష్టిని వెంటనే ఆకట్టుకుంటుంది. తద్వారా అమ్మకాలు పెరుగుతాయి. దీంతో కంపెనీలు ప్యాకేజింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. సృజనాత్మకతతో విభిన్నమైన ప్యాకేజీలను సృష్టించాలనే ఆసక్తి ఉన్నవారు ప్యాకేజింగ్ కోర్సులను అభ్యసించవచ్చు.
మనదేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) వివిధ ప్యాకేజింగ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. దీనికి హైదరాబాద్‌లోనూ శాఖ ఉంది.
సైన్స్/టెక్నాలజీ/ఇంజనీరింగ్ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అర్హులు. హైదరాబాద్‌లో జేఎన్ పాలిటెక్నిక్ కళాశాల ప్యాకేజింగ్ లో డిప్లొమా కోర్సును అందిస్తోంది. పాలిసెట్ ద్వారా ప్రవేశం ఉంటుంది.
కెరీర్ స్కోప్:
ప్రైవేట్ రంగంలోని అనేక సంస్థలు ప్యాకేజింగ్ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఫుడ్ అండ్ బేవరేజెస్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, పేపర్, ప్లాస్టిక్ తయారీ యూనిట్లలో మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రొడక్షన్, మార్కెటింగ్, పర్చేజ్, ఆర్ అండ్ డీ వంటి విభాగాల్లో ప్యాకేజింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్/ఆపరేటర్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్టు, ఇంజనీర్, సైంటిస్టు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ తదితర హోదాల్లో అవకాశాలు అందుకోవచ్చు. సొంతంగా ప్యాకేజింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందొచ్చు. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పొందొచ్చు. తర్వాత అనుభవం, పనితీరును బట్టి అధిక వేతనాలు అందుకోవచ్చు.
వివరాలకు: వెబ్సైట్: www.iip-in.com