నేలకు దించారు!
స్వదేశంలో టి20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఫేవరెట్‌గా పరిగణించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి... భారత బ్యాటింగ్‌లో డెప్త్. తొమ్మిదో నంబర్ ఆటగాడి వరకూ బ్యాటింగ్ చేయగలగడం, టాపార్డర్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం. రెండు... సొంతగడ్డపై స్పిన్నర్లు బాగా ప్రభావం చూపుతారనే నమ్మకం. ఈ రెండు కారణాల వల్ల ప్రపంచం అంతా భారత్‌ను విజేతగా చూసింది. కానీ నాణ్యమైన స్పిన్నర్లు లేరని భావించిన న్యూజిలాండ్ భారత్‌ను ఈ స్థాయిలో చిత్తు చేస్తుందనేది ఊహకందని విషయం.
శైలికి భిన్నంగా జట్టు...
సాధారణంగా ఎలాంటి పిచ్‌ల మీద ఆడినా న్యూజిలాండ్ జట్టు పేస్ ఆయుధంగా జట్టును ఎంపిక చేస్తుంది. కానీ నాగ్‌పూర్ పిచ్‌ను చూసిన తర్వాత బౌల్ట్, సౌతీలాంటి సూపర్ స్టార్స్‌ను కూడా పక్కనబెట్టి ముగ్గురు స్పిన్నర్లను ఆడించింది. నాథన్ మెకల్లమ్, సాన్‌ట్నర్, సోధి... ఈ ముగ్గురూ అడపాదడపా మెరిసే వాళ్లే తప్ప ఎప్పుడూ నిలకడగా వికెట్లు సాధించిన బౌలర్లు కాదు. భారత్ జట్టులోని అశ్విన్, రవీంద్ర జడేజాలతో పోలిస్తే ఈ స్పిన్ త్రయం పెద్దగా ప్రభావం చూపుతుందనీ అనుకోలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెంటనే విలియమ్సన్ చెప్పినట్లు రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బాగా నెమ్మదించింది. దీనిని సమర్థంగా వినియోగించుకోవడంలో న్యూజిలాండ్ స్పిన్నర్లు విజయవంతమయ్యారు.
ఓపిక లేకపోతే ఎలా?
నిజానికి న్యూజిలాండ్ చేసిన 126 పరుగులు టి20 మ్యాచ్‌లో ఎలాంటి పిచ్‌పై అయినా గొప్ప స్కోరేం కాదు. కివీస్‌ను తక్కువ స్కోరుకు నియంత్రించడంలో భారత బౌలర్లు విజయవంతం అయ్యారు. పార్ట్‌టైమ్ స్పిన్నర్ రైనా బంతిని తిప్పినప్పుడే భారత బ్యాట్స్‌మెన్‌కు పిచ్‌పై అవగాహన వచ్చి ఉండాలి. ఈ పిచ్‌పై బ్యాటింగ్ కష్టమని తొలి ఓవర్లోనే భారత బ్యాట్స్‌మెన్‌కు అర్థమైంది. అయితే ఎవరూ ఓపిక చూపించలేకపోయారు. 26 పరుగులకే నాలుగు వికెట్లు పడ్డా కోహ్లి, ధోని ఉన్నంతసేపు భారత్ విజయంపై ఎవరికీ సందేహాలు లేవు. కానీ న్యూజిలాండ్ స్పిన్నర్లు నిజంగా అద్భుతం చేశారు.
బంతిని అనూహ్యంగా తిప్పారు. ధోని చివరి వరకూ క్రీజులో నిలబడాలనే ఉద్దేశంతో కాస్త ‘బుర్ర’ వాడి బ్యాటింగ్ చేసినా, మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా మూర్ఖంగా అవుటయ్యారు. ఏమైనా తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం భారత జట్టును నేలకు దించింది. ఇన్నాళ్లూ తమకు ఎదురులేదనే ధీమాతో ఉన్న జట్టును ఆలోచనలో పడేసి ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన నష్టం లేదు. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధిస్తే సెమీస్‌కు చేరొచ్చు. ఏమైనా ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారని ఆశిద్దాం. - సాక్షి క్రీడావిభాగం