కిట్స్‌తో సరి.. శిక్షణేది?
=సిబ్బంది ఎంపికలో ఎస్హెచ్ఓల జాప్యం
=జాడలేని ఠాణా ఫోరెన్సిక్ బృందాలు
=నేరస్థలాల్లో ఆధారాల సేకరణకు తప్పని ఇబ్బందులు
సాక్షి, సిటీబ్యూరో: బేగంపేటలోని నగర పోలీసు కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై ఉగ్రవాదులు మానవబాంబు దాడి చేసినప్పుడు దర్యాప్తునకు తొలి ఆధారాన్ని ఇచ్చింది ఘటనాస్థలిలో దొరికిన చెప్పులే...పంజగుట్టలోని అలుకాస్ జ్యువెలరీ షోరూమ్‌లో రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు చోరీకి గురైనప్పుడు పోలీసులకు దిశ, దశలను చూపించింది పక్క బిల్డింగ్‌పై దొరికిన ‘గుజరాత్ సమాచార్’ అనే పత్రికే... వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభమైనట్టు ఎంతటి సంచలనాత్మక కేసు దర్యాప్తు అయినా చిన్న క్లూతోనే మొదల వుతుంది. నేర పరిశోధనలో ఆధారాలకు ఉన్న ప్రాధాన్యం అంత కీలకమైంది. వీటి సేకరణకు ఏర్పాటైందే క్లూస్టీమ్గా పిలిచే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఏళ్లుగా ఉన్న ఒకే టీమ్‌కు అ దనంగా 2011లో ఠాణాల వారీగా బృందాల్ని ఏర్పాటు చేయాలని భావించి ఉపకరణాలు పంపిణీ చేశారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడంతో ఇప్పటి వరకూ ఇది ఆచరణకు నోచుకోలేదు.
60 ఠాణాల్లో అందుబాటులో ఉండాలని...
దర్యాప్తు అధికారులు మూసధోరణిలో ముందు కు వెళ్లకుండా అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు గతంలో నిర్ణయించారు. దీనికోసం వీడి యో కెమెరాలు, సాఫ్ట్వేర్స్ సమకూర్చారు. ద ర్యాప్తుల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్‌కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన అధికారులు దీని సేకరణపైనా దృష్టి పెట్టారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న 60 పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగే ఘటనలకు సంబంధించి ఆధారాలు సేకరణకు ఒకే క్లూస్ టీమ్ ఉండటంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ బృందం ఘటనాస్థలికి చేరుకోవడంలో ఆలస్యమౌతుంటడంతో కొన్ని భౌతిక సాక్ష్యాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. మరోపక్క ప్రతి చిన్న ఉదంతానికీ ఈ టీమ్‌నే వినియోగిస్తుండటంతో పనిభారంతో తీవ్ర ఒత్తిడి మధ్య పని చేయడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు.
పరిష్కారంగా ఠాణాల్లో ఏర్పాటు చేసినా...
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అప్పటి కమిషనర్ ఏకే ఖాన్ కమిషనరేట్ స్థాయిలో ఫోరెన్సిక్ వ్యవస్థను పరిపుష్టం చేయాలని భావించారు. గతంలో నేరం జరిగితే కానిస్టేబుల్ ప్రధాన ఇన్ఫార్మెంట్గా ఉంటూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమాచారం సేకరించే వారు. కాలక్రమంలో పని ఒత్తిడి, ఇతర కారణాల నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేరస్థలంలో నిక్షిప్తమై ఉన్న నేరగాళ్ల సమాచారం సేకరించడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్‌లు చాలా కీలకం. ప్రతి ఉదంతంలోనూ క్లూస్ టీమ్ వచ్చే వరకు ఎదురుచూడకుండా కొన్ని నమూనాలు, ఆధారాలు సేకరించడానికి అవసరమైన ఉపకరణాలు ఠాణాల్లో అందుబాటులో ఉంచాలని భావించిన ఏకే ఖాన్ 2011 ఆగస్టులో వాటిని కొనుగోలు చేశారు.
మూన్నాళ్లకే మూలనపడ్డ కిట్స్...
క్లూస్ సేకరణకు అవసరమైన ఉపకరణాలను ఠాణాలకు అందించిన అధికారులు.. ఎంపిక చేసిన సిబ్బందికి క్లూస్ సేకరణపై ఓరియంటేషన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయిం చారు. ఆధారాల సేకరణలో క్రైమ్ సీన్ మేనేజ్ మెంట్ ఎంతో కీలకం కావడంతో సమర్థులైన, అవగాహన ఉన్న కానిస్టేబుల్ స్థాయి వారిని గుర్తించి శిక్షణ తరగతులకు పంపాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ ప్రక్రియ జరగకపోవడంతో సైంటిఫిక్ కిట్స్ మూలనపడి ఎందుకూ కొరగాకుండా పోయాయి.