విచారణలో కక్కుర్తి
ఎంసెట్ లీకేజీ విచారణ పక్కదారి
బ్రోకర్‌తో మిలాకత్ అయిన సీఐడీ డీఎస్పీ
బాలుజాదవ్పై సస్పెన్షన్ వేటు
కానిస్టేబుల్‌పై కూడా చర్య
వరంగల్ : ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీ కేసు విచారణలో నిందితులకు సహకరించాడన్న ఆరోపణలతో సీఐడీ డీఎస్పీ బాలుజాదవ్, కానిస్టేబుల్ సదాశివరావుపై వేటు పడింది. విచారణను పక్కదారి పట్టించేలా వ్యవహరించారనే కారణంగా డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణ జరుగుతోంది. దీని కోసం సీఐడీ విభాగం పలు బృందాలను ఏర్పాటు చేసింది. మహబూబాబాద్‌కు చెందిన బ్రోకర్ గుమ్మడి వెంకటేశ్‌ను ఈ కేసులో నిందితుడిగా సీఐడీ గుర్తించింది.
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించాలని వరంగల్ సీఐడీ విభాగం డీఎస్పీ బాలుజాదవ్‌ను ఈ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. బ్రోకర్ వెంకటేశ్‌ను అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చినా అరెస్టు చేయకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. బ్రోకర్‌ను అరెస్టు చేసేందుకు మరో బృందాన్ని రాష్ట్ర అధికారులు పంపించారు. ఈ బృందం సదరు బ్రోకర్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లగా.. ఇప్పటికే ఒక అధికారి వచ్చాడని, ఈ కేసు నుంచి తప్పిస్తే రూ.2లక్షలకు ఇచ్చేందుకు ఒప్పుకొని అందులో సగం రూ.లక్ష ఇచ్చానని బ్రోకర్ వెంకటేశం అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.
దీంతో సీఐడీ అధికారులు ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినట్లు తెలిసింది. ఈ ఆరోపణలపై రాష్ట్ర సీఐడీ విభాగం విచారణ చేపట్టగా డీఎస్పీ బాలుజాదవ్ బ్రోకర్ వద్ద డబ్బులు తీసుకున్నట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. సీఐగా బాలు జాదవ్ వర్ధన్నపేట, నర్సంపేట, సుబేదారి పోలీసు స్టేషన్లలో పనిచేసినప్పుడు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై డీఎస్పీ బాలుజాదవ్‌ను వివరణ కోరగా శనివారం విలేకరుల సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.