కార్పొరేట్ దివాలా పిటిషన్లకు 180 రోజుల్లో మోక్షం!
లోక్ సభకు దివాలా కోడ్-2015 బిల్లు
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారాలకు మరింత సానుకూల పరిస్థితులను కల్పించడంలో భాగంగా కేంద్రం దివాలా బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్-2015’ను లోక్ సభ ముందు ఉంచింది. కంపెనీలు, వ్యక్తుల దివాలా పిటిషన్లను నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించడమే ఈ బిల్లు ప్రధానోద్దేశం. దీనివల్ల దేశంలో పెట్టుబడులు పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
వృత్తి నిపుణులు; కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ్యక్తుల దివాలా సంబంధ అంశాలను పరిష్కరించే ఏజెన్సీలు, సమాచార యుటిలిటీలను నియంత్రించేందుకుగాను ప్రత్యేకంగా ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. దీంతోపాటు దివాలా ఫండ్‌ను నెలకొల్పాలని కోడ్‌లో ప్రతిపాదించారు.
ముఖ్యాంశాలివీ...
* ఈ బిల్లు ప్రకారం ఒక కార్పొరేట్ కంపెనీ దివాలా పిటిషన్‌ను 180 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. అదనంగా మరో 90 రోజుల గడువు పొడిగించే వెసులుబాటు కల్పించారు.
* అంతేకాకుండా ఫాస్ట్-ట్రాక్ పద్ధతిలో 90 రోజుల్లోనే కార్పొరేట్ దివాలా పిటిషన్లను పరిష్కరించే ప్రతిపాదనను కోడ్‌లో చేర్చారు.
* ప్రస్తుత నిబంధనల ప్రకారం దివాలా పిటిషన్ల పరిష్కారానికి అనవసర జాప్యాలు పెరిగిపోతున్నాయని.. దీన్ని నివారించేందుకే కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి వస్తోందని కేంద్రం పేర్కొంది.
* ప్రస్తుతం దివాలా పిటిషన్ల పరిష్కారానికి నిర్దిష్టంగా ఒక చట్టమంటూ లేదు. కంపెనీల దివాలా, మూసివేత అంశాలను హైకోర్టులు; వ్యక్తిగత దివాలా కేసులను ప్రెసిడెన్సీ టౌన్స్ ఇన్సాల్వెన్సీ చట్టం-1909, ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ చట్టం-1920 కింద పరిష్కరిస్తున్నారు.
* వీటితో పాటు ఎస్ఐసీఏ-1985, రికవరీ ఆఫ్ డెట్ డ్యూస్ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చట్టం-1993, సర్ఫేసీ చట్టం-2002, కంపెనీల చట్టం-2013 కూడా దివాలా అంశాల పరిష్కారానికి సంబంధించినవే.
* ఇప్పుడు ఈ చట్టాల్లోని అంశాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు ఈ కొత్త కోడ్‌ను తీసుకొస్తున్నామని బిల్లుకు సంబందించిన ప్రకటనలో తెలిపారు.
* ప్రతిపాదిత కొత్త చట్టం ప్రకారం వ్యక్తులెవరైనా దివాలా పిటిషన్‌ను దాఖలు చేయాలంటే వార్షిక వ్యక్తిగత ఆదాయం రూ. 60,000కు మించకూడదు. అంతేకాకుండా ఆస్తి విలువ కూడా రూ. 25,000 దిగువనే ఉండాలి. సొంత నివాస గృహం ఉండకూడదు.
* కాగా, దివాలా పిటిషన్ల విషయంలో ఆస్తులను వెల్లడించకుండా దాచిపెట్టడం, రుణదాతలను మోసం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటివి చోటుచేసుకుంటే.. జరిమానాతో పాటు ఐదేళ్లవరకూ జైలు శిక్ష పడేవిధంగా బిల్లులో ప్రతిపాదించారు.
కార్పొరేట్ మోసం కోటి దాటితే ప్రభుత్వం దృష్టికి
ఆడిటర్ల విధులపై కంపెనీల చట్టానికి సవరణలు
న్యూఢిల్లీ: ఆడిటర్లు కంపెనీల ఖాతాలను పరిశీలించే క్రమంలో రూ. 1 కోటి పైగా విలువ చేసే సందేహాస్పద కార్పొరేట్ మోసాల ఉదంతాలేమైనా గుర్తించిన పక్షంలో ప్రభుత్వం దృష్టికి తేవాల్సి ఉంటుంది. కంపెనీల చట్టానికి ఈ మేరకు సవరణలు చేస్తూ కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిబంధనలు ప్రకటించింది. మోసం ఉదంతం తెలిసిన రెండు రోజుల్లోగా ఆడిటరు ముందుగా కంపెనీ బోర్డు లేదా ఆడిట్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలి. దీనిపై 45 రోజుల్లోగా వాటి నుంచి వివరణ తీసుకోవాలి. ఆ తర్వాత 15 రోజుల్లోగా ఆడిటరు తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది.