డెల్ కొత్త నోట్‌బుక్.. రేటెంతో తెలుసా?
డెల్ కంపెనీ ఓ కొత్త నోట్‌బుక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇన్సిరాన్ 5000 సిరీస్‌లో తాజా నోట్‌బుక్ ఇన్సిరాన్ 5567ను ఆవిష్కరిస్తున్నట్టు డెల్ వెల్లడించింది. వ్యక్తిగత వినియోగదారులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ నోట్‌బుక్‌ను తీసుకొచ్చినట్టు తెలిపింది. 23.3ఎంఎం మందం, ప్రకాశవంతంగా ఈజీ-ఓపెన్ డిజైన్‌లో ఉండే ఈ నోట్‌బుక్ ప్రారంభ ధర రూ.39,590గా కంపెనీ నిర్ణయించింది. వైట్, మిడ్నైట్ బ్లూ, ఫాగ్ గ్రే, బ్లాక్, బలి బ్లూ, టాంగో రెడ్ వంటి ఆకట్టుకునే రంగుల్లో కంపెనీ ఈ నోట్‌బుక్‌ను తీసుకొచ్చింది.
మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను, వైబ్రంట్ గ్రాఫిక్స్‌ను ఇది అందించగలదని కంపెనీ చెబుతోంది. 15.6 అంగుళాల డిస్ప్లే, ఆప్షనల్ ఫుల్ హెచ్డీ ప్యానెల్, ఏడవ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 2టీబీ వరకు స్టోరేజ్ విస్తరణ, ఎంతో శక్తివంతమైన ఏఎమ్‌డీ రేడియాన్ ఆర్7 సిరీస్ గ్రాఫిక్స్ నోట్‌బుక్ ఇన్సిరాన్ 5567 ఫీచర్లు. ఈ నోట్‌బుక్ బ్యాటరీ 10 గంటల వరకు నిరంతరాయంగా పనిచేయనుంది. వినోదానికి, కంప్యూటింగ్‌కు ఇది ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది.